8 కీలక పరిశ్రమల వృద్ధి ఓకే...
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఆగస్టులో 3.7 శాతంగా నమోదయ్యింది. జూలైలో ఈ రేటు 3.1 శాతం. ఎనిమిది పరిశ్రమల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పతి సూచీ (ఐఐపీ)లో వీటి వాటా దాదాపు 38%. ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ కొంత మెరుగైన ఫలితాలను నమోదుచేసుకోవడం వల్ల ఈ కీలక పరిశ్రమల వృద్ధి రేటు 7 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఆగస్టు ఐఐపీ గణాంకాలపై ఈ సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకుల అంచనా. 2012 ఆగస్టుతో పోల్చి 2013 ఆగస్టులో గణాంకాలను రంగాల వారీగా చూస్తే...
ఎరువులు: గణాంకాలు క్షీణత (-2.1 శాతం) నుంచి వృద్ధి బాటకు ఎగశాయి. 1.7 శాతం వృద్ధి నమోదయ్యింది.
ఉక్కు: వృద్ధి 2.9% నుంచి 4.3 శాతానికి ఎగసింది.
సిమెంట్: ఉత్పత్తి వృద్ధి రేటు 0.4 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది.
విద్యుత్: భారీగా ఉత్పత్తి వృద్ధి 1.9 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది.
బొగ్గు: ఉత్పత్తి వృద్ధి రేటు 18.8 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింది.
రిఫైనరీ ప్రొడక్టులు: ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 31.8% నుంచి భారీగా 4.9 శాతానికి పడిపోయింది.
క్రూడ్ ఆయిల్: క్షీణత (-) 0.6 శాతం నుంచి మరింతగా 1.5 శాతానికి జారింది.
సహజ వాయువు: ఈ రంగంలో క్షీణత సైతం 13.5 శాతం నుంచి 16.1 శాతానికి పడిపోయింది.
కాగా 2012 ఇదే నెలలో కీలక రంగాల వృద్ధి 6.1%. ఈఏడాది ఏప్రిల్- ఆగస్టు మధ్య గ్రూప్ వృద్ధి రేటు 2.3%. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 6.3 శాతం.