ఆటోమేషన్‌పై ఉద్యోగుల స్పందన
ఆటోమేషన్‌పై ఉద్యోగుల స్పందన
Published Thu, Sep 14 2017 4:13 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులకు మెడపై కత్తిలా వేలాడుతోందని... దీంతో మొత్తం పరిశ్రమ రూపురేఖలే మారిపోయి, భారీ ఎత్తున్న ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశమున్నట్టు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. అయితే దీనిలో ఎంత నిజముంది? నిజంగానే భారీ ఎత్తున్న ఉద్యోగాలను ఆటోమేషన్ హరించుకుపోతుందా? దీనిపై అసలు ఉద్యోగులేమంటున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవడం కోసం రిక్రూట్‌మెంట్ సంస్థ మైఖెల్ పేజ్ ఇండియా ఓ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుత తమ పనితీరుపై ఆటోమేషన్ పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని 87 శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.
ఉద్యోగం పోతుందనే భయమున్నప్పటికీ, ఆటోమేషన్ ప్రభావం సానుకూలమేనని వారు పేర్కొన్నారని వెల్లడైంది. అంతేకాక, మెజారిటీ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలపై విశ్వాసం కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. 1000కి పైగా భారతీయ ఉద్యోగులపై ఈ అధ్యయనం చేపట్టింది. సంబంధిత పరిశ్రమల్లో ఆటోమేషన్ ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవడం కోసం భారతీయ నిపుణుల వైఖరిని విశ్లేషించింది. దీనిలో 87 శాతం మంది ఆటోమేషన్ ప్రస్తుత తమ పనితీరులో పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని తెలుపగా... 78 శాతం మంది తమ భవిష్యత్తు ఉద్యోగాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేశారని ఈ రిక్రూట్‌మెంట్ సంస్థ చెప్పింది. తమ ఉద్యోగాలను రోబోటిక్స్ భర్తీ చేస్తాయని అనుకోవడం లేదని 83 శాతం రెస్పాడెంట్లు చెప్పారు. 17 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
Advertisement
Advertisement