Michael Page India
-
భారత జాబ్ మార్కెట్ భేష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఉద్యోగ మార్కెట్ బలంగా నిలబడిందని.. పలు రంగాల్లో నియామకాలు మెరుగ్గా సాగాయని మైఖేల్ పేజ్ ఇండియా (అంతర్జాతీయ నియామకాల సంస్థ) ఎండీ నిలయ్ ఖండేల్వాల్ తెలిపారు. సాంకేతిక నైపుణ్యాల్లో లోతైన అనుభవం, వ్యయ నియంత్రణలు, సిబ్బంది కొత్త నైపుణ్యాలను వేగంగా అలవరుచుకోవడాన్ని భారత్ బలాలుగా పేర్కొన్నారు.ఆర్థిక వృద్ధి మందగమనంతో అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొనగా.. భారత్‌లో మాత్రం నిపుణులకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. స్టెమ్ విభాగంలో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఆధిపత్యంతో భారత్ నైపుణ్య కేంద్రంగా కొనసాగుతోందని.. పోటీతో కూడిన వేతనాలు, ప్రభుత్వ మద్దతుతో నైపుణ్యాల కల్పన, అంతర్జాతీయ క్యాపబులిటీ కేంద్రాల (జీసీసీలు) విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.జీసీసీలు ఏఐ, ఆటోమేషన్, ఆర్అండ్డీపై దృష్టి సారించడం వల్ల ఆవిష్కరణలకు భారత్ కీలక కేంద్రంగా మారినట్టు చెప్పారు. స్కిల్ ఇండియా, ఏఐ ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచుతాయన్నారు. భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే, నైపుణ్యాల అభివృద్ధిని వేగవంతం చేయాలంటూ.. ఏఐ, సెమీకండక్టర్ పరిశ్రమల్లో అధిక నైపుణ్య మానవ వనరుల అవసరం ఉంటుందని సూచించారు.ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం పెరుగుతున్నందున ఉత్పాదకత ఆధారిత పని నమూనాలపై కంపెనీలు దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఈవై జీసీసీ సర్వే, 2024ను ఉదహరిస్తూ.. అంతర్జాతీయ సంస్థల్లో 50 శాతం భారత్‌లో తమ జీసీసీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్టు తెలిపారు. -
వేతన జీవులకు అదిరిపోయే శుభవార్త..!
కోవిడ్-19 రాకతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి మార్పులు చోటుచోసుకోలేదు. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు సర్దుమనగడంతో ఆయా రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కాగా ఈ ఏడాదిలో వేతన జీవుల శాలరీలు బాగా పెరుగుతాయని జాబ్స్ అండ్ రిక్రూటింగ్ ఎజెన్సీ మైకేల్ పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. కోవిడ్-19 ముందు ఇచ్చిన శాలరీ హైక్ కంటే ఈ ఏడాది ఎక్కువ ఇవ్వాలని కంపెనీలు చూస్తున్నట్లు తెలుస్తోంది. 9 శాతం మేర జీతాల పెంపు..! కరోనా సంక్షోభం నుంచి ఆయా రంగాలు గణనీయంగా పుంజుకోవడం... మార్కెట్లో టాలెంట్ ఉన్నవాళ్లు తక్కువగా ఉండడంతో ఉద్యోగుల జీతాలను భారీగా పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు మైకేల పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఏడాది దేశంలోని కంపెనీలు సగటున 9 శాతం మేర జీతాలను పెంచేందుకు సిద్దంగా ఉన్నాయని వెల్లడించింది. ఆయా కంపెనీల్లో నిర్వహించిన సర్వే ప్రకారం జీతాల పెంపు నివేదికను మైకేల్ పేజ్ ఇండియా రూపోందించింది. ఈ సర్వేలో 13 మేజర్ సెక్టార్లకు చెందిన 500 కంపెనీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. వీరికి భారీగా పెరగనున్న జీతాలు అట్రిషన్ రేటు కూడా జీతాల పెంపుకు దారితీసిందని మైకేల్‌పేజ్ తన నివేదికలో వెల్లడించింది. ఐటీ, ఐటీ సంబంధిత సెక్టార్, మాన్యుఫాక్చరింగ్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, రిటైల్, గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ (జీఐసీ), ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) సెక్టార్లలోని పెద్ద కంపెనీలు ఈ ఏడాది సగటున 8–12 శాతం శాలరీ హైక్‌ను చేపట్టనున్నాయని మైకల్ పేజ్ ఇండియా శాలరీ సర్వేలో తేలింది. అంతేకాకుండా ఫిన్‌టెక్, కన్జూమర్ టెక్, బీ2బీ, హెల్త్‌టెక్, క్రిప్టో, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) రంగాల్లోని స్టార్టప్‌లు శాలరీలను ఎక్కువగా పెంచాలని చూస్తున్నాయని అన్నారు. స్టార్టప్స్‌లో భారీగా పెంపు..! స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, త్వరలో యూనికార్న్‌లుగా మారబోయే కంపెనీలు ఉద్యోగులకు భారీ వేతన పెంపును అందిస్తాయని మైకేల్ పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ఆయా కంపెనీల ఉద్యోగులకు సగటున 12 శాతం మేర జీతాలను పెంచనున్నాయి. గత రెండేళ్ల కంటే ఈ సారి శాలరీ హైక్ ఎక్కువగా ఉంటుందని, కరోనా ముందు లెవెల్స్‌ను దాటుతుందని మైకల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల్ వెల్లడించారు. చదవండి: పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు..! -
ఆటోమేషన్‌పై ఉద్యోగుల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులకు మెడపై కత్తిలా వేలాడుతోందని... దీంతో మొత్తం పరిశ్రమ రూపురేఖలే మారిపోయి, భారీ ఎత్తున్న ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశమున్నట్టు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. అయితే దీనిలో ఎంత నిజముంది? నిజంగానే భారీ ఎత్తున్న ఉద్యోగాలను ఆటోమేషన్ హరించుకుపోతుందా? దీనిపై అసలు ఉద్యోగులేమంటున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవడం కోసం రిక్రూట్మెంట్ సంస్థ మైఖెల్ పేజ్ ఇండియా ఓ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుత తమ పనితీరుపై ఆటోమేషన్ పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని 87 శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఉద్యోగం పోతుందనే భయమున్నప్పటికీ, ఆటోమేషన్ ప్రభావం సానుకూలమేనని వారు పేర్కొన్నారని వెల్లడైంది. అంతేకాక, మెజారిటీ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలపై విశ్వాసం కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. 1000కి పైగా భారతీయ ఉద్యోగులపై ఈ అధ్యయనం చేపట్టింది. సంబంధిత పరిశ్రమల్లో ఆటోమేషన్ ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవడం కోసం భారతీయ నిపుణుల వైఖరిని విశ్లేషించింది. దీనిలో 87 శాతం మంది ఆటోమేషన్ ప్రస్తుత తమ పనితీరులో పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని తెలుపగా... 78 శాతం మంది తమ భవిష్యత్తు ఉద్యోగాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేశారని ఈ రిక్రూట్మెంట్ సంస్థ చెప్పింది. తమ ఉద్యోగాలను రోబోటిక్స్ భర్తీ చేస్తాయని అనుకోవడం లేదని 83 శాతం రెస్పాడెంట్లు చెప్పారు. 17 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.