
పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల కంటికి మాత్రం ఎప్పుడూ చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. సంతానంపై వారికున్న వాత్సల్యం అటువంటిది. ముఖ్యంగా తండ్రికి, కూతురికి ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ తండ్రి తన కూతురుని రాజకుమార్తెలాగానే భావిస్తాడు. కూతురికి కూడా మొదటి హీరో తన తండ్రే. ఇలాంటి భావోద్వేగాలకు తాను కూడా మినహాయింపు కాదంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.
తన కూతురు ఇరాఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమిర్ షేర్ చేసిన ఫొటో, ఆమెపై కురిపించిన ప్రేమ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్నారి ఇరాను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమిర్...‘ 21వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇరా.!!!నువ్వు ఇంత త్వరగా ఎదిగావన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా! నాకెప్పుడూ నువ్వు ఆరేళ్ల చిన్నారివే. లవ్ యూ పాపా’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో లక్షల్లో లైకులు కొడుతూ నెటిజన్లు ఇరాపై శుభాకాంక్షల జల్లు కురిపిస్తున్నారు. కాగా ఆమిర్ ఖాన్-రీనా దత్తాలకు కుమార్తె ఇరా, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు. 2002లో రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్.. మూడేళ్ల అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment