పెళ్లి ఎంత ఆర్భాటంగా చేసుకున్నా చాలామంది కలకాలం కలిసి ఉండలేకపోతున్నారు. సెలబ్రిటీలైతే ఫ్రెండ్‌షిప్‌లో కటీఫ్ చెప్పుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా ఇలా ఒకటి కాదు రెండు విడాకులు తీసుకున్నాడు. మొదట్లో రీనా దత్తాను పెళ్లాడిన అతడు 2002లో ఆమెకు విడాకులిచ్చాడు. అనంతరం కిరణ్ రావును పెళ్లాడిన ఈ హీరో 15 ఏళ్లపాటు తనతో కలిసి ఉండి 2021లో ఆమెకు కూడా విడాకులిచ్చేశాడు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నాడు.
అయితే ఆమిర్ ఖాన్ మొదటి విడాకుల వల్ల తాను ఎంతగానో డిస్టర్బ్ అయ్యానంటోంది అతడి కూతురు ఇరా ఖాన్. ఇటీవలే ఆమె మానసిక ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా అగస్తు సంస్థను స్థాపించింది. ఈ సందర్భంగా ఇరా ఖాన్ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో తను కూడా మానసికంగా క్షోభకు గురయ్యానని చెప్పుకొచ్చింది.
'అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంత ప్రభావితం కాలేదు. కానీ ఏదో తెలియని బాధ మాత్రం నన్ను దహించివేసింది. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే చెప్తే వాళ్లు బాధపడతారని! ఏడాదిన్నరపాటు ఒకరకమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. నాలుగు రోజులపాటు తిండి కూడా మానేశాను. రోజులో నాలుగు గంటలు ఏడ్చేదాన్ని, 10 గంటలు పడుకునేదాన్ని. ప్రతి 8-10 నెలలకు ఒకసారి మానసికంగా మరింత ఆందోళన చెందేదాన్ని. ఇది పాక్షికంగా జన్యుపరమైనదే! నా కుటుంబంలో కొందరికి మానసిక రుగ్మతలున్నాయి. ఈ మానసిక వ్యాధిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది.
నేను కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే నెమ్మదిగా డిప్రెషన్ ఊబిలో కూరుకుపోయాను. గతేడాది జూలైలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నేను మందులు కూడా తీసుకోవడం మానేశా, ఒక్కసారిగా బరువు పెరిగాను. ఆ తర్వాత డిప్రెషన్‌తో పోరాడేలా నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను' అని ఇరా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్- రీనా దత్తాల రెండో కూతురు ఇరా ఖాన్. ఇరా కంటే ముందు వీరికి జునైద్ అనే కుమారుడున్నాడు. ఆమిర్- కిరణ్ రావులకు ఆజాద్ అనే తనయుడున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment