
న్యూఢిల్లీ: సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 38 శాతం పెరిగి రూ.346 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.250 కోట్లు. కంపెనీ ఆదాయం సైతం 11 శాతం వృద్ధి చెంది రూ.4,076 కోట్లుగా నమోదైంది. జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా కంపెనీ అనుసరిస్తోంది. కంపెనీ మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 8 శాతం పెరిగి రూ.3,556 కోట్లుగా ఉన్నాయి.
సిమెంట్ విక్రయాలు 5.6 శాతం పెరిగి 7.5 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. సిమెంట్ విభాగం నుంచి రూ.3,587 కోట్లు (7 శాతం పెరుగుదల), రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం ఆదాయం రూ.393 కోట్లు (18 శాతం అధికం)గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం మంచి వృద్ధిని నమోదు చేసినట్టు ఏసీసీ ఎండీ, సీఈవో నీరజ్ అకోరీ తెలిపారు. డ్రైమిక్స్ ఉత్పత్తులపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment