Cement manufacturing
-
సాగర్ సిమెంట్‌కు నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న సాగర్ సిమెంట్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10 కోట్ల నికర నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43 కోట్ల నష్టం నమోదైంది. ఎబిటా రూ.60 కోట్లు, ఎబిటా మార్జిన్ 10 శాతంగా ఉంది. టర్నోవర్ రూ.474 కోట్ల నుంచి రూ.587 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 1.13 శాతం అధికమై రూ.250.55 వద్ద స్థిరపడింది. -
తప్పుదోవ పట్టించడానికే బిల్డర్ల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాన్య ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికే బిల్డర్లు సమ్మెకు దిగుతున్నారని దక్షిణ భారత సిమెంట్ తయారీదార్ల సంఘం (సిక్మా) తెలిపింది. సిమెంటు కారణంగా నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయన్న బిల్డర్ల ఆరోపణలను సంఘం ఖండించింది. ‘ఆర్థిక పునరుద్ధరణ ప్రయోజనాలను మరింత పొందాలన్నది బిల్డర్ల భావన. ఇందులో భాగంగా రియల్టీ ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పటికే ప్రధానికి, ఆర్థిక మంత్రికి సిక్మా తన లేఖ ద్వారా వివరించింది. దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇవ్వాల్సి ఉంది’ అని సిక్మా స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధిలోకి తేవాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో.. ఇళ్ల ధరలను గణనీయంగా తగ్గించి సామాన్యుడికి నీడను అందించాల్సిందిపోయి రియల్టీ ధరలను పెంచుకోవడానికి ఆధారం లేని కారణాలను చూపి ప్రయోజనం పొందాలన్నది బిల్డర్స్ అసోసియేషన్ ఎత్తుగడ అని సిక్మా వెల్లడించింది. నిర్మాణ వ్యయం 50 శాతం లోపే.. ‘మార్కెట్లో సిమెంటు ఒక మెట్రిక్ టన్నుకు రూ.6,000 లోపే బిల్డర్లు కొనుగోలు చేస్తున్నారు. బిల్ట్ అప్ ఏరియాలో ఒక చదరపు అడుగుకు సిమెంటుకు అయ్యే వ్యయం రూ.150 మాత్రమే. అలాంటప్పుడు ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంలో సిమెంటు ప్రభావం ఎంత అని ప్రజలు ఆలోచించాలి. సిమెంటు బస్తా ధర రూ.100 పెరిగిందని బిల్డర్లు అంటున్నారు. వాస్తవానికి అయిదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే ధరలు స్థిరంగా ఉన్నాయి. తప్పుడు బిల్లుల ద్వారా జీఎస్టీ (28 శాతం) అధిక ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలన్నది వారి ఉద్దేశమా? పలు మార్కెట్లలో మేము చేపట్టిన అధ్యయనం ప్రకారం ఇంటి విక్రయ ధరలో నిర్మాణ వ్యయం 50 శాతం కూడా లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని ఎందుకు కోరడం లేదు? తద్వారా ప్రజలకే మేలు కదా. నిర్మాణం పూర్తి అయిన, సెమి ఫినిష్డ్ ఇళ్లను బిల్డర్లు అట్టిపెట్టుకునే బదులు ధరలు తగ్గించి ఎందుకు విక్రయించడం లేదు? వినియోగదార్ల నుంచి డబ్బులు తీసుకుని ఇంటి నిర్మాణం ఆలస్యం చేస్తున్న, వదిలేసిన బిల్డర్లపై అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకుంది’ అని సిక్మా పలు ప్రశ్నలను సంధించింది. -
ఏసీసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 38 శాతం పెరిగి రూ.346 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.250 కోట్లు. కంపెనీ ఆదాయం సైతం 11 శాతం వృద్ధి చెంది రూ.4,076 కోట్లుగా నమోదైంది. జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా కంపెనీ అనుసరిస్తోంది. కంపెనీ మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 8 శాతం పెరిగి రూ.3,556 కోట్లుగా ఉన్నాయి. సిమెంట్ విక్రయాలు 5.6 శాతం పెరిగి 7.5 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. సిమెంట్ విభాగం నుంచి రూ.3,587 కోట్లు (7 శాతం పెరుగుదల), రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం ఆదాయం రూ.393 కోట్లు (18 శాతం అధికం)గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం మంచి వృద్ధిని నమోదు చేసినట్టు ఏసీసీ ఎండీ, సీఈవో నీరజ్ అకోరీ తెలిపారు. డ్రైమిక్స్ ఉత్పత్తులపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. -
బీఎంఎం సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి
సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న సాగర్ సిమెంట్స్.. బీఎంఎం సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియను మే నెలలో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఇరు కంపెనీల మధ్య గతేడాది నవంబరులో వాటా కొనుగోలు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఇతర లాంఛనాలు మే 15కల్లా పూర్తి అవుతాయని సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. బీఎంఎం ఉత్పత్తి చేస్తున్న సిమెంటును కొనుగోలు చేసి సాగర్ సిమెంట్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్నట్టు కంపెనీ శుక్రవారం బీఎస్ఈకి వెల్లడించింది. బీఎంఎం కొనుగోలుకై సాగర్ సిమెంట్స్ రూ.540 కోట్లను వెచ్చిస్తోంది. బీఎంఎంకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఏటా 10 లక్షల టన్నుల సిమెంటు ఉత్పత్తి చేయగల ప్లాంటుతోపాటు 25 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉంది. ఈ కంపెనీ చేరికతో సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 37.5 లక్షల టన్నులకు చేరుకుంది. -
అల్ట్రాటెక్ లాభం రూ. 838 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ 15.5% అధికంగా రూ. 838 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఇతర వ్యయాలను అదుపు చేయడం వంటి చర్యల ద్వారా లాభదాయకతను మెరుగుపరచుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీటికితోడు నికర అమ్మకాలు రూ. 5,391 కోట్ల నుంచి రూ. 5,832 కోట్లకు పెరగడం కూడా ఇందుకు దోహదపడింది. ప్రధానంగా బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ సిమెంట్ తయారీ సామర్థ్యం 53.95 మిలియన్ టన్నులుకాగా, 12.18 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్, క్లింకర్లను విక్రయించింది. గతేడాది క్యూ4 అమ్మకాలతో పోలిస్తే ఇవి 9% అధికం. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 9 డివిడెండ్‌ను ప్రకటించింది. సిమెంట్ విక్రయాలు అప్ క్యూ4లో సిమెంట్ తదితరాల విక్రయాలు 2.92 లక్షల టన్నుల నుంచి 3.29 లక్షల టన్నులకు పెరిగాయి. కాగా, ముడిసరుకులు, విద్యుత్, రవాణా తదితర వ్యయాలు కూడా రూ. 4,987 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,655 కోట్ల నుంచి రూ. 2,144 కోట్లకు క్షీణించింది. అమ్మకాలు దాదాపు యథాతథంగా రూ. 20,203 కోట్ల వద్దే నిలిచాయి. ఈ కాలంలో 41.47 మిలియన్ టన్నుల సిమెంట్, క్లింకర్లను విక్రయించింది. బొగ్గు దిగుమతి వ్యయాలు తగ్గినప్పటికీ, రూపాయి విలువ క్షీణించడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదని కంపెనీ వివరించింది. విస్తరణ ప్రణాళికలపై రూ. 10,000 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 1.4% తగ్గి రూ. 2,170 వద్ద ముగిసింది.