అల్ట్రాటెక్ లాభం రూ. 838 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ 15.5% అధికంగా రూ. 838 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఇతర వ్యయాలను అదుపు చేయడం వంటి చర్యల ద్వారా లాభదాయకతను మెరుగుపరచుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీటికితోడు నికర అమ్మకాలు రూ. 5,391 కోట్ల నుంచి రూ. 5,832 కోట్లకు పెరగడం కూడా ఇందుకు దోహదపడింది.
ప్రధానంగా బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ సిమెంట్ తయారీ సామర్థ్యం 53.95 మిలియన్ టన్నులుకాగా, 12.18 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్, క్లింకర్‌లను విక్రయించింది. గతేడాది క్యూ4 అమ్మకాలతో పోలిస్తే ఇవి 9% అధికం. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 9 డివిడెండ్‌ను ప్రకటించింది.
సిమెంట్ విక్రయాలు అప్
క్యూ4లో సిమెంట్ తదితరాల విక్రయాలు 2.92 లక్షల టన్నుల నుంచి 3.29 లక్షల టన్నులకు పెరిగాయి. కాగా, ముడిసరుకులు, విద్యుత్, రవాణా తదితర వ్యయాలు కూడా రూ. 4,987 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,655 కోట్ల నుంచి రూ. 2,144 కోట్లకు క్షీణించింది. అమ్మకాలు దాదాపు యథాతథంగా రూ. 20,203 కోట్ల వద్దే నిలిచాయి. ఈ కాలంలో 41.47 మిలియన్ టన్నుల సిమెంట్, క్లింకర్‌లను విక్రయించింది. బొగ్గు దిగుమతి వ్యయాలు తగ్గినప్పటికీ, రూపాయి విలువ క్షీణించడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదని కంపెనీ వివరించింది. విస్తరణ ప్రణాళికలపై రూ. 10,000 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 1.4% తగ్గి రూ. 2,170 వద్ద ముగిసింది.