హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాన్య ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికే బిల్డర్లు సమ్మెకు దిగుతున్నారని దక్షిణ భారత సిమెంట్ తయారీదార్ల సంఘం (సిక్మా) తెలిపింది. సిమెంటు కారణంగా నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయన్న బిల్డర్ల ఆరోపణలను సంఘం ఖండించింది. ‘ఆర్థిక పునరుద్ధరణ ప్రయోజనాలను మరింత పొందాలన్నది బిల్డర్ల భావన. ఇందులో భాగంగా రియల్టీ ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పటికే ప్రధానికి, ఆర్థిక మంత్రికి సిక్మా తన లేఖ ద్వారా వివరించింది. దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇవ్వాల్సి ఉంది’ అని సిక్మా స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధిలోకి తేవాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో.. ఇళ్ల ధరలను గణనీయంగా తగ్గించి సామాన్యుడికి నీడను అందించాల్సిందిపోయి రియల్టీ ధరలను పెంచుకోవడానికి ఆధారం లేని కారణాలను చూపి ప్రయోజనం పొందాలన్నది బిల్డర్స్ అసోసియేషన్ ఎత్తుగడ అని సిక్మా వెల్లడించింది.
నిర్మాణ వ్యయం 50 శాతం లోపే..
‘మార్కెట్లో సిమెంటు ఒక మెట్రిక్ టన్నుకు రూ.6,000 లోపే బిల్డర్లు కొనుగోలు చేస్తున్నారు. బిల్ట్ అప్ ఏరియాలో ఒక చదరపు అడుగుకు సిమెంటుకు అయ్యే వ్యయం రూ.150 మాత్రమే. అలాంటప్పుడు ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంలో సిమెంటు ప్రభావం ఎంత అని ప్రజలు ఆలోచించాలి. సిమెంటు బస్తా ధర రూ.100 పెరిగిందని బిల్డర్లు అంటున్నారు. వాస్తవానికి అయిదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే ధరలు స్థిరంగా ఉన్నాయి. తప్పుడు బిల్లుల ద్వారా జీఎస్టీ (28 శాతం) అధిక ఇన్‌పుట్ క్రెడిట్ తీసుకోవాలన్నది వారి ఉద్దేశమా? పలు మార్కెట్లలో మేము చేపట్టిన అధ్యయనం ప్రకారం ఇంటి విక్రయ ధరలో నిర్మాణ వ్యయం 50 శాతం కూడా లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని ఎందుకు కోరడం లేదు? తద్వారా ప్రజలకే మేలు కదా. నిర్మాణం పూర్తి అయిన, సెమి ఫినిష్డ్ ఇళ్లను బిల్డర్లు అట్టిపెట్టుకునే బదులు ధరలు తగ్గించి ఎందుకు విక్రయించడం లేదు? వినియోగదార్ల నుంచి డబ్బులు తీసుకుని ఇంటి నిర్మాణం ఆలస్యం చేస్తున్న, వదిలేసిన బిల్డర్లపై అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకుంది’ అని సిక్మా పలు ప్రశ్నలను సంధించింది.
తప్పుదోవ పట్టించడానికే బిల్డర్ల సమ్మె
Published Thu, Feb 11 2021 4:47 AM | Last Updated on Thu, Feb 11 2021 4:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment