ACC cements
-
లాభాల్లోకి ఏసీసీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్లో నష్టాలను వీడి రూ. 388 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాలు పుంజుకోవడం, ఇంధన వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్, నిర్వహణా సామర్థ్యం తోడ్పాటునిచ్చాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 87 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతంపైగా పుంజుకుని రూ. 4,435 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,987 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో సిమెంట్, క్లింకర్ అమ్మకాలు 17 శాతంపైగా ఎగసి 8.1 మిలియన్ టన్నులను తాకాయి. మొత్తం వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 4,127 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 1,913 వద్ద ముగిసింది. -
ఓరియంట్ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!
సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్ సిమెంట్ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్ సిమెంట్ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్ 250 కిలోగ్రాములుగా ఉంది. -
అంబుజా, ఏసీసీ వాటాను తనఖాలో ఉంచిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ ఇటీవల సొంతం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీలలో వాటాను తనఖాలో ఉంచింది. మొత్తం 13 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 1,04,000 కోట్లు) విలువైన వాటాను తనఖా పెట్టింది. డాయిష్ బ్యాంక్ ఏజీ హాంకాంగ్ బ్రాంచీ వద్ద అంబుజా సిమెంట్స్‌లో 63.15 శాతం వాటాతోపాటు.. ఏసీసీలోని 56.7 శాతం వాటా(అంబుజా ద్వారా 50 శాతం వాటా)ను కుదువ పెట్టినట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. కొద్ది రోజులక్రితమే ఈ వాటాలను 6.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా చర్య కొంతమంది రుణదాతలు, ఫైనాన్స్ భాగస్వాములకు లబ్ది చేకూర్చగలదని అదానీ గ్రూప్ ఈ సందర్భంగా పేర్కొంది. రానున్న ఐదేళ్లలో సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు పెంచుకునే ప్రణాళికలు వెల్లడించిన నేపథ్యంలో తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక సిమెంట్ సామర్థ్యాన్ని 14 కోట్ల టన్నులకు చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రెండు రోజులక్రితం వాటాదారులకు వెల్లడించారు. తద్వారా దేశీయంగా అత్యంత లాభదాయక కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేశారు. అత్యుత్తమ ఆర్థిక పురోగతి, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ కట్టుబాటు వంటి అంశాలు సిమెంటుకు భారీ డిమాండును సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మార్జిన్లు అత్యధి క స్థాయిలో మెరుగుపడనున్నట్లు అంచనా వేశారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేరు 6 శాతం పతనమై రూ. 539 వద్ద ముగిసింది. ఏసీసీ సైతం 7 శాతం తిరోగమించి రూ. 2,535 వద్ద స్థిరపడింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
అదానీ కీలక నిర్ణయం: కరణ్ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు
న్యూఢిల్లీ: స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఆవిర్భవించింది. కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్ డాలర్లకు హోల్సిమ్ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ టేకోవర్ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు) గౌతమ్ అదానీ అధ్యక్షతన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్ ఇండియా మాజీ హెడ్ నితిన్ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్ బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ఇదీ చదవండి: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్ -
ఏసీసీ, అంబుజాకు ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే వారం సిమెంట్ రంగ దిగ్గజాల వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశముంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ లిస్టెడ్ కంపెనీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి మే నెలలోనే అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా రెండు సిమెంట్ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు రూ. 31,000 కోట్లు వెచ్చించే వీలుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 10.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫర్ ధరలు ఇలా.. ఓపెన్ ఆఫర్ నిర్వాహక సంస్థల తాజా సమాచారం ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్ వాటాదారులకు అదానీ గ్రూప్ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ నెల 26 నుంచి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 9న ముగియనున్న ఆఫర్లో భాగంగా ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300, అంబుజా సిమెంట్ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19,880 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇక ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకునేందుకు రూ. 11,260 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్ వాటాలు కలిగి ఉంది. రెండు సంస్థల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. దేశవ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీమిక్స్ యూనిట్లను కలిగి ఉన్నాయి. -
అంబుజా, ఏసీసీకి ఓపెన్ ఆఫర్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా రెండు లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఆఫర్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలలో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న నేపథ్యంలో సెబీ నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 385 ధర ప్రకటించగా.. ఏసీసీకి రూ. 2,300 ధరతో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ సిమెంట్ దిగ్గజాలలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో సుమారు రూ. 81,300 కోట్ల(10.5 బిలియన్ డాలర్లు) విలువైన(ఓపెన్ ఆఫర్‌తో కలిపి) ఒప్పందాన్ని అదానీ గ్రూప్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మారిషస్ సంస్థ ద్వారా మారిషస్ అనుబంధ(ఆఫ్‌షోర్) సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అదానీ గ్రూప్ అంబుజా, ఏసీసీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 51.63 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఇదే విధంగా ఏసీసీ వాటాదారుల నుంచి 26 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకోనుంది. ఇందుకు మరో రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. అంబుజా, ఏసీసీలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో నికరంగా అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం అంబుజా, ఏసీసీ వార్షికంగా 70 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్ షేరు 2.3% బలపడి రూ. 367.4 వద్ద నిలవగా.. ఏసీసీ 4% జంప్‌చేసి రూ. 2,193 వద్ద ముగిసింది. -
అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్‌లు ప్రకటించాయి. వెరసి సిమెంట్ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్ ప్లాంట్లు, కోల్ మైన్స్ నిర్వహించే అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీవైపు దృష్టిసారించింది. ఈ బాటలో సిమెంట్ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ దేశీయంగా సిమెంట్ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. కాగా.. సిమెంట్ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతోపాటు.. అల్ట్రాటెక్ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. డీల్ వివరాలివీ.. ► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్ ఇండియా అంబుజా సిమెంట్స్‌లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ► అంబుజా సిమెంట్‌కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్‌కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించనుంది. ► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. ► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల ప్రస్తుత సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షికంగా 119.95 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. దిగ్గజాల తీరిదీ ► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్) విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ► అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది. ► 2015లో ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్తో హోల్సిమ్ విలీనమైంది. లఫార్జ్హోల్సిమ్గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్‌లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది. క్వింటిలియన్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 49 శాతం వాటా కొనుగోలు డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్(క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్(క్యూఎంఎల్)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలుకి క్వింట్ డిజిటల్ మీడియా(క్యూడీఎంఎల్)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్ బల్ కంపెనీ క్యూబీఎంఎల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. క్యూబీఎంఎల్.. బ్లూమ్బెర్గ్క్వింట్ పేరుతో బిజినెస్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ కోసమే అదానీ గ్రూప్‌తో డీల్‌ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్ తెలిపింది. కాగా, డీల్ విలువ తెలియలేదు., మార్గదర్శనం దేశీయంగా మా బిజినెస్‌లను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్ నాయకత్వం వహించగలదు. – జాన్ జెనిష్, సీఈవో, హోల్సిమ్ లిమిటెడ్ వృద్ధిపై విశ్వాసం సిమెంట్ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్. -
ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..!
ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ హోల్సిమ్ గ్రూప్ (హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్- Holcim Group) భారత్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కంపెనీ గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా..భారత్ నుంచి తమ వ్యాపారాలకు స్వస్తి పలుకుతూ కోర్ మార్కెట్లపై హోల్సిమ్ గ్రూప్ దృష్టి సారించనున్నట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. గత పదిహేడుళ్లుగా హోల్సిమ్ గ్రూప్ భారత్ మార్కెట్లలో తమ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇక హోల్సిమ్ గ్రూప్‌కు చెందిన రెండు లిస్టెడ్ కంపెనీలోని వాటాలను కూడా విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్..అంబుజా సిమెంట్, ఎసీసీ సిమెంట్ కంపెనీల్లో వాటాలను కల్గి ఉంది. అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం, ఎసీసీ కంపెనీలో 4.48 శాతం వాటాలను హోల్సిమ్ గ్రూప్ కల్గి ఉంది. హోల్సిమ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయంతో సిమెంట్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆయా రంగ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఇరు కంపెనీల వాటాలను అదానీ గ్రూప్స్, జెఎస్‌డబ్య్లూ సిమెంట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటాల విక్రయంతో రుణ భారం తగ్గించుకోవాలని హోల్సిమ్ గ్రూప్ చూస్తోంది. అలాగే కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్ చేసుకోవాలని భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో హోల్సిమ్ గ్రూప్ తన బ్రెజిలియన్ యూనిట్‌ను సుమారు ఒక బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇక భారత్‌లో పాటుగా జింబాబ్వేలోని వ్యాపారాలను కూడా విక్రయించేందుకు సిద్దమైన్నట్లు సమాచారం. కారణం అదే..! హోల్సిమ్ గ్రూప్ ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు సిద్దమవుతోంది. స్పెషాలిటీ బిల్డింగ్ సొల్యూషన్స్, హై ఎండ్ ఎనర్జీ ఎఫిసియెంట్ రెనోవేషన్స్ వంటి విభాగాలపై హోల్సిమ్ గ్రూప్ ఫోకస్ చేయనుంది. ‘స్ట్రాటజీ 2025 ఆక్సల్రెటింగ్ గ్రీన్ గ్రోత్ ప్రోగాం’లో భాగంగా ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు హోల్సిమ్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కంపెనీ డిసెంబర్ 2021లో మలర్కీ రూఫింగ్ ఉత్పత్తులను, 2021 ప్రారంభంలో ఫైర్‌స్టోన్ బిల్డింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. చదవండి: విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు? -
ఏసీసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 38 శాతం పెరిగి రూ.346 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.250 కోట్లు. కంపెనీ ఆదాయం సైతం 11 శాతం వృద్ధి చెంది రూ.4,076 కోట్లుగా నమోదైంది. జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా కంపెనీ అనుసరిస్తోంది. కంపెనీ మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 8 శాతం పెరిగి రూ.3,556 కోట్లుగా ఉన్నాయి. సిమెంట్ విక్రయాలు 5.6 శాతం పెరిగి 7.5 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. సిమెంట్ విభాగం నుంచి రూ.3,587 కోట్లు (7 శాతం పెరుగుదల), రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం ఆదాయం రూ.393 కోట్లు (18 శాతం అధికం)గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం మంచి వృద్ధిని నమోదు చేసినట్టు ఏసీసీ ఎండీ, సీఈవో నీరజ్ అకోరీ తెలిపారు. డ్రైమిక్స్ ఉత్పత్తులపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. -
ఏసీసీ లాభం రూ. 329 కోట్లు
న్యూఢిల్లీ: సిమెంటు దిగ్గజం ఏసీసీ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 329 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన రూ. 326 కోట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధి సాధించింది. ఏసీసీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తుంది. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలం రెండో త్రైమాసికం అవుతుంది. క్యూ2లో కంపెనీ నికర అమ్మకాలు విలువపరంగా రూ. 3,329 కోట్ల నుంచి రూ. 3,768 కోట్లకు పెరిగాయి. సిమెంటు విక్రయాలు 6.74 మిలియన్ టన్నుల నుంచి 7.24 మిలియన్ టన్నులకు చేరాయి. విక్రయాల్లో వృద్ధి సాధించినప్పటికీ.. ముడివస్తువుల ధరలు, రవాణా చార్జీలు గణనీయంగా పెరగడం వల్ల వ్యయాలపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయని ఏసీసీ ఎండీ నీరజ్ అఖోరి తెలిపారు. ఈ నేపథ్యంలో సిమెంటు, రెడీమిక్స్ వ్యాపార విభాగాలను పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలపైనా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. -
జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్
-
జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్
వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. నేడు (గురువారం) ఏసీసీ సిమెంట్స్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత సుధీర్ రెడ్డి, మానవహక్కుల వేదిక కన్వీనర్ జయ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టు సమాచారం.