
అదానీ పోర్ట్స్ నికర లాభం 25 శాతం అప్
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీ సెజ్) కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.661 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది.
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీ సెజ్) కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.661 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.530 కోట్లు)తో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఇతర ఆదాయం అధికంగా ఉండడం, కార్గో పరిమాణం పెరగడం వల్ల నికర లాభంలో మంచి వృద్ధి సాధించామన్నారు. ఇక మొత్తం ఆదాయం రూ.1,291 కోట్ల నుంచి 42% వృద్ధితో రూ.1,832 కోట్లకు, ఇబిటా రూ.836 కోట్ల నుంచి 49% వృద్ధితో రూ.1,247 కోట్లకు పెరిగాయని వివరించారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.1,740 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.2,314 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.5,514 కోట్ల నుంచి 24% వృద్ధితో రూ.6,838 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌లో తాము కొనుగోలు చేసిన ధామ్ర పోర్ట్ కంపెనీ ఫలితాలు కూడా ఈ ఫలితాల్లోనే కలగలసి ఉన్నాయని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 55% డివిడెండ్‌ను(ఒక్కో షేర్‌కు రూ.1.10) కంపెనీ ప్రకటించింది.