అదానీ పవర్ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.326 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.
ఈ క్యూ3లో రూ.326 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: అదానీ పవర్ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.326 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్) తక్కువగా ఉండడం, వడ్డీ వ్యయాలు అధికంగా ఉండడం, తక్కువ ఇబిటా కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని అదానీ పవర్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.104 కోట్ల నికర లాభం వచ్చిందని అదానీ పవర్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు.
గత క్యూ3లో రూ.6,211 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.5,873 కోట్లకు తగ్గిందని తెలిపారు. విద్యుత్తు విక్రయాలు 16.9 బిలియన్ యూనిట్ల నుంచి 14.9 బిలియన్ యూనిట్లకు తగ్గాయని వివరించారు. విద్యుత్తు టారిఫ్‌లు తక్కువగా ఉండటంతో ఇబిటా రూ.2,030 కోట్ల నుంచి 16 శాతం క్షీణించి రూ.1,708 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. చర మూలధన వినియోగం అధికంగా ఉండడం, విదేశీ కరెన్సీ డెరివేటివ్స్‌కు సంబంధించి మార్క్ టు మార్కెట్ ప్రభావం కారణంగా వడ్డీ వ్యయాలు రూ.1,318 కోట్ల నుంచి రూ.1,430 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.