
న్యూఢిల్లీ : ఏజెంట్ స్మిత్ అనే పేరున్న మొబైల్ మాల్‌వేర్ (హానికార వైరస్) ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తన పరిశోధనలో గుర్తించింది. వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్ అప్లికేషన్ల స్థానంలో, వాటినే పోలిన హానికారక వెర్షన్లను ప్రవేశపెడుతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ మాల్‌వేర్ ముఖ్యంగా హిందీ, అరబిక్, రష్యన్, ఇండోనేషియా భాషలు మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ఈ విషయమై గూగుల్‌ను సంప్రతించామని, హానికారక యాప్స్ ఏవీ ప్లే స్టోర్‌లో మిగిలి లేవని చెక్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
‘‘ఇప్పటి వరకు ఈ మాల్‌వేర్ బారిన పడిన వారు ప్రధానంగా భారత్‌తో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఉన్నారు. అలాగే, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోని ఫోన్లలో దీన్ని గుర్తించడం జరిగింది’’ అని చెక్‌పాయింట్ తెలిపింది. మోసపూరిత ప్రకటనలను చూపించి, ఆర్థిక ప్రయోజనం పొందేందుకు ఇది ప్రయత్నిస్తోందని, బ్యాంకింగ్ వివరాలను కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. విశ్వసనీయమైన యాప్ స్టోర్ల నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి కానీ, థర్డ్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయించొద్దని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment