స్టార్ట్‌అప్ క్యాపిటల్‌గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్ట్‌అప్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ‘టీ-హబ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తున్న టి-హబ్ మొదటి దశ వచ్చే జనవరి కల్లా సిద్ధం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. మొత్తం 3.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు దశల్లో ఈ ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశ కింద 80,000 చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుందన్నారు.
ఆగస్టు నెలాఖరున జరిగే స్టార్ట్‌అప్ ఫెస్టివల్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ నాస్కామ్ లక్ష్యంగా పెట్టుకున్న 10,000 స్టార్ట్‌అప్స్‌కి చోటు కల్పించే శక్తి ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టార్ట్‌అప్ ఫెస్టివల్‌ను ‘ఆగస్ట్ ఫెస్ట్’ పేరుతో ఆగస్టు 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నామని, ఇందులో సుమారు 1,500 నుంచి 2,000 కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా 100 స్టార్ట్‌అప్ కంపెనీలకు నిధులను సమకూర్చడంతోపాటు 25 కంపెనీలకు సీడ్ ఫండింగ్ కూడా చేయనున్నట్లు తెలిపారు.