startups in Hyderabad
-
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
దేశంలో స్టార్టప్‌ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా దేశాల నుంచి అంతర్జాయ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (కెనియా), టాంజానియా సమాచార, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది.జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నిధులు సమకూర్చిన రెండు ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధి బృందం సందర్శించింది.రెండు రోజుల సైట్ సందర్శనలో ప్రతినిధి బృందం సభ్యులు కీలకమైన వాటాదారులతో సంభాషించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకున్నారు.అలాగే, ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ ద్వారా మద్దతిచ్చే టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్ వంటి ఇన్నోవేషన్ ప్రాంగణాలను సందర్శించింది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలోని భారతదేశపు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుంది. -
మళ్లీ టెక్ ‘లేఆఫ్’.. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్ : టెక్ ‘లేఆఫ్స్’మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఐటీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరి తొలి రెండువారాల్లోనే 58 టెక్ కంపెనీలు 7,785 మంది ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్–ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తాజాగా స్పష్టం చేసింది. టెక్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఈ లేఆఫ్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే..రాబోయే రోజులు కూడా భారత ఐటీ వృత్తినిపుణులు, టెకీలకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగిడి ఇంకా మూడు వారాలు కూడా దాటకుండానే వేలాది మంది టెక్ స్టార్టప్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురికాగా, రాబోయే రోజుల్లో ఇంకా కొందరికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయపడుతున్నారు. ‘జెనరేటివ్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి పరోక్షంగా కారణమని వారంటున్నారు. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా.... ► గూగుల్... డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ అండ్ ఇంజినీరింగ్ టీమ్‌లలో వందలాదిమంది ► అమెజాన్ సంస్థలోని అమెజాన్ ఆడిబుల్ తమ వర్క్‌ఫోర్స్‌లో ఐదు శాతం ► అమెజాన్ ప్రైమ్ వీడియోలో వందలాదిమంది ఉద్యోగులు ► అమెజాన్ ట్విచ్ తన వర్క్‌ఫోర్స్‌లో 35 శాతం అంటే 500 మంది ► సోషల్ చాట్, మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్ 17 శాతం ఉద్యోగులను అంటే 170 మంది ► వీడియోగేమ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్వేర్ తన ఉద్యోగుల్లో 25 శాతం అంటే 1,800 మంది ► ఐటీ కంపెనీ జిరాక్స్ తన వర్క్‌ఫోర్స్‌ను 15 శాతం అంటే 3000మంది ► యూఎస్‌కు చెందిన ప్రాప్‌టెక్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ గూగుల్ మీట్లో రెండు నిమిషాల్లోనే తన 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదంతా ఇదే పరిస్థితి ఉండొచ్చు భారతీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడం/వాయిదా పడడంతో ఆ ప్రభావం ఇక్కడి ఐటీ పరిశ్రమపై పడింది. యూఎస్ వడ్డీరేట్ల పెరుగుదల, పరిశ్రమపై చాట్ జీపీటీ వంటి కృత్రిమమేథ ప్రభావాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయిల్ వ్యవహారం, ఎర్రసముద్రంలో హైతీ తీవ్రవాదుల దాడులు వంటివి కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికా డాలర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇండియాకు రావాల్సిన నూతన ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరోనా కాలంలో భారీగా ప్రాజెక్టులు వస్తాయని కంపెనీలు ఊహించి పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేశాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరిట పెద్దసంఖ్యలో లేఆఫ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. 2020–21 నుంచే యూఎస్ ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచడం మొదలుపెట్టింది. ఈ విధంగా చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చునని భావించింది. అయితే మూడేళ్లుగా ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా ఇలాంటి చర్యలే కొనసాగాయి. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా కూడా ప్రస్తుత పరిస్థితులే కొనసాగే అవకాశాలున్నాయి. – ఎన్.లావణ్యకుమార్, స్మార్ట్‌స్టెప్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు లేఆఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌కు దిగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఈ ప్రకంపనలు భారత్ టెక్, ఐటీ ఇండస్ట్రీపై కూడా పడడంతో ఇది ఎటువైపు దారితీస్తుంది..ఎలాంటి చిక్కులు, అడ్డంకులు సృష్టిస్తుందనేది చూడాలి. ఆర్థికంగా ఎదురయ్యే పరిస్థితులు, మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు తదితరాలతో మనదేశంలోనూ పెద్ద కంపెనీ లేఆఫ్స్‌కు దిగడం మొదలుపెట్టాయి. గ్లోబల్ ఐటీ వర్క్‌ఫోర్స్‌కు భారత్ అందిస్తున్న భాగస్వామ్యం ముఖ్యమైనది కావడంతో లేఆఫ్స్‌తో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే. ఐటీరంగమనేది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్న కారణంగా ప్రస్తుత లేఆఫ్స్ వంటి పరిణామాలతో భారత జాబ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. ఈ ప్రభావాలు, పరిణామాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ దిగ్గజాలు, వృత్తినిపుణులు కలిసి సంయుక్తంగా ముందుకు సాగితే లేఆఫ్స్ అనంతర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. – కార్తీక్ డాలే, డేటాస్కిల్స్ సంస్థ ఫౌండర్ -
హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్– 2లో స్టార్టప్‌లు నెలకొల్పేందుకు తాజాగా వంద వరకు దేశ, విదేశీ సంస్థలు క్యూ కట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే సుమారు 200 అంకుర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం విదితమే. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు,కృత్రిమ మేథ,సైబర్‌సెక్యూరిటీ తదితర రంగాలతో పాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఐటీ శాఖ ఈహబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా దాదాపు రెండువేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. స్టార్టప్‌లకు కేరాఫ్.. ► టీహబ్– 2 కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని.. ప్రపంచంలోనే రెండోదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీ హబ్ మొదటి దశను ఐఐఐటీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నెలకొల్పారు. ► స్టార్టప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకే చోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ సూపర్‌హిట్.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతమైంది. హబ్‌లో గత ఏడేళ్లుగా 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ, విదేశాల్లో పని చేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవ, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ► ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమోడే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. ఐటీ బూమ్‌కు దోహదం.. టీహబ్ ఒకటి, రెండో దశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత వృద్ధి సాధించేందుకు ఈ హబ్‌లు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
హైదరాబాద్‌లో సీఐఐ స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హైదరాబాద్‌లో ఔత్సాహికపారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో స్టార్టప్స్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని, ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఐఐ మంగళవారం తెలియజేసింది. సీఐఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కో–ఫౌండర్, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్‌కు చెందిన ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్‌లు సపోర్ట్ చేస్తున్నాయి. వినూత్న ఆలోచనలు, స్టార్టప్స్‌కు మెంటారింగ్, అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక ప్రోత్సాహం అందించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యమని సీఐఐ తెలియజేసింది. -
స్టార్ట్అప్ క్యాపిటల్‌గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్ట్అప్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ‘టీ-హబ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తున్న టి-హబ్ మొదటి దశ వచ్చే జనవరి కల్లా సిద్ధం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. మొత్తం 3.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు దశల్లో ఈ ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశ కింద 80,000 చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుందన్నారు. ఆగస్టు నెలాఖరున జరిగే స్టార్ట్అప్ ఫెస్టివల్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ నాస్కామ్ లక్ష్యంగా పెట్టుకున్న 10,000 స్టార్ట్‌అప్స్‌కి చోటు కల్పించే శక్తి ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టార్ట్అప్ ఫెస్టివల్‌ను ‘ఆగస్ట్ ఫెస్ట్’ పేరుతో ఆగస్టు 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నామని, ఇందులో సుమారు 1,500 నుంచి 2,000 కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా 100 స్టార్ట్అప్ కంపెనీలకు నిధులను సమకూర్చడంతోపాటు 25 కంపెనీలకు సీడ్ ఫండింగ్ కూడా చేయనున్నట్లు తెలిపారు.