సాక్షి, హైదరాబాద్ : టెక్ ‘లేఆఫ్స్’మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఐటీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరి తొలి రెండువారాల్లోనే 58 టెక్ కంపెనీలు 7,785 మంది ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్–ట్రాకింగ్ వెబ్‌సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తాజాగా స్పష్టం చేసింది.
టెక్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఈ లేఆఫ్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే..రాబోయే రోజులు కూడా భారత ఐటీ వృత్తినిపుణులు, టెకీలకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగిడి ఇంకా మూడు వారాలు కూడా దాటకుండానే వేలాది మంది టెక్ స్టార్టప్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురికాగా, రాబోయే రోజుల్లో ఇంకా కొందరికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయపడుతున్నారు. ‘జెనరేటివ్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి పరోక్షంగా కారణమని వారంటున్నారు.
దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా....
► గూగుల్... డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ అండ్ ఇంజినీరింగ్ టీమ్‌లలో వందలాదిమంది
► అమెజాన్ సంస్థలోని అమెజాన్ ఆడిబుల్ తమ వర్క్‌ఫోర్స్‌లో ఐదు శాతం
► అమెజాన్ ప్రైమ్ వీడియోలో వందలాదిమంది ఉద్యోగులు
► అమెజాన్ ట్విచ్ తన వర్క్‌ఫోర్స్‌లో 35 శాతం అంటే 500 మంది
► సోషల్ చాట్, మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్ 17 శాతం ఉద్యోగులను అంటే 170 మంది
► వీడియోగేమ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్‌వేర్ తన ఉద్యోగుల్లో 25 శాతం అంటే 1,800 మంది
► ఐటీ కంపెనీ జిరాక్స్ తన వర్క్‌ఫోర్స్‌ను 15 శాతం అంటే 3000మంది
► యూఎస్‌కు చెందిన ప్రాప్‌టెక్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ గూగుల్ మీట్‌లో రెండు నిమిషాల్లోనే తన 200 మంది ఉద్యోగులను తొలగించింది.
ఏడాదంతా ఇదే పరిస్థితి ఉండొచ్చు
భారతీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడం/వాయిదా పడడంతో ఆ ప్రభావం ఇక్కడి ఐటీ పరిశ్రమపై పడింది. యూఎస్ వడ్డీరేట్ల పెరుగుదల, పరిశ్రమపై చాట్ జీపీటీ వంటి కృత్రిమమేథ ప్రభావాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయిల్ వ్యవహారం, ఎర్రసముద్రంలో హైతీ తీవ్రవాదుల దాడులు వంటివి కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికా డాలర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇండియాకు రావాల్సిన నూతన ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరోనా కాలంలో భారీగా ప్రాజెక్టులు వస్తాయని కంపెనీలు ఊహించి పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేశాయి.
ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరిట పెద్దసంఖ్యలో లేఆఫ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. 2020–21 నుంచే యూఎస్ ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచడం మొదలుపెట్టింది. ఈ విధంగా చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చునని భావించింది. అయితే మూడేళ్లుగా ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా ఇలాంటి చర్యలే కొనసాగాయి. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా కూడా ప్రస్తుత పరిస్థితులే కొనసాగే అవకాశాలున్నాయి. – ఎన్.లావణ్యకుమార్, స్మార్ట్‌స్టెప్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు
లేఆఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి
ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌కు దిగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఈ ప్రకంపనలు భారత్ టెక్, ఐటీ ఇండస్ట్రీపై కూడా పడడంతో ఇది ఎటువైపు దారితీస్తుంది..ఎలాంటి చిక్కులు, అడ్డంకులు సృష్టిస్తుందనేది చూడాలి. ఆర్థికంగా ఎదురయ్యే పరిస్థితులు, మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు తదితరాలతో మనదేశంలోనూ పెద్ద కంపెనీ లేఆఫ్స్‌కు దిగడం మొదలుపెట్టాయి. గ్లోబల్ ఐటీ వర్క్‌ఫోర్స్‌కు భారత్ అందిస్తున్న భాగస్వామ్యం ముఖ్యమైనది కావడంతో లేఆఫ్స్‌తో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే. ఐటీరంగమనేది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్న కారణంగా ప్రస్తుత లేఆఫ్స్ వంటి పరిణామాలతో భారత జాబ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. ఈ ప్రభావాలు, పరిణామాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ దిగ్గజాలు, వృత్తినిపుణులు కలిసి సంయుక్తంగా ముందుకు సాగితే లేఆఫ్స్ అనంతర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. – కార్తీక్ డాలే, డేటాస్కిల్స్ సంస్థ ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment