
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కొంతమంది ప్రయాణీకులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. విమాన టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే నలుగురు ప్రయాణికులకు ముక్కునుంచి రక‍్తం కారడం మొదలైంది. మరికొంతమంది చెవి నొప్పి లాంటి ఇతర సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణిల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
మస్కట్ నుంచి ఎయిరిండియా విమానం కాలికట్( కాజీకోడ్) వెడుతుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. వెంటనే అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. బాధిత ప్రయాణీకులకు పూర్తి వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ప్రమాదం ఏదీ లేదని తేల్చడంతో మస్కట్ విమానాశ్రయం నుంచి విమానం తిరిగి బయలుదేరింది.
దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. విమానంలో వైమానిక పీడనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నలుగురు ప్రయాణీకులకు ముక్కునుంచి రక్తస్రావం జరిగిందని వారికి తగిన చికిత్స అందిచినట్టు తెలిపారు. బోయింగ్ 737 , 8 ఐఎక్స్ -350 విమానంలో మొత్తం 185 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో ముగ్గురు శిశువులు.
Comments
Please login to add a commentAdd a comment