న్యూఢిల్లీ: అంతర్జాతీయ రూట్లలో బిజినెస్ తరగతి ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రీమియం ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు కూడా అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ సీఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలా తెలియజేశారు. దీనివల్ల బిజినెస్ తరగతిలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందన్నారు. సాధారణంగా ఈ తరగతిలో సగానికి సగం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.
‘దూర ప్రాంతాలకు వెళ్లే ఫ్లయిట్స్‌లో బిజినెస్ తరగతి సీట్లు.. కంపెనీకి మంచి ఆదాయం తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో సుమారు యాభై శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. మెరుగైన సేవలు అందించడం ద్వారా దీన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆన్–ఫ్లయిట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశం సరిగ్గా లేని పక్షంలో... దానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు అందించే అవకాశాలు కూడా ఉన్నాయి‘ అని ఖరోలా తెలిపారు.
అయితే, ఇన్–బిల్ట్ వీడియో స్క్రీన్‌లు పనిచేయనప్పుడు మాత్రమే ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలా? లేక ప్రీమియం ప్రయాణికులందరికీ అదనపు సౌకర్యం కింద వీటిని అందించాలా? అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారాయన.
ఫిబ్రవరిలో మూడు కొత్త విమానాలు..
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌కి నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించడంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోని దూరప్రాంతాలకు మరిన్ని సర్వీసులు నడిపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అటు ఫిబ్రవరి నాటికి మూడు కొత్త బోయింగ్ 777 విమానాలు అందుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment