ఎకానమీ ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్
న్యూఢిల్లీ: కొంత మొత్తం అదనంగా చెల్లిస్తే దేశీ రూట్లలో ఎకానమీ తరగతి ప్రయాణికులు బిజినెస్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందుకోసం వారు తీసుకున్న ఎకానమీ టికెట్ రేటు కన్నా రూ. 5,000 నుంచి రూ. 7,000 దాకా అదనంగా చెల్లించాల్సి వస్తుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ముందస్తుగా కొనుక్కున్న చౌక టికెట్లకు కూడా .. ‘గెట్ అప్ ఫ్రంట్’ అనే ఈ అప్‌గ్రేడ్ స్కీము వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర 43 నగరాల్లో అక్టోబర్ 31 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తూ.. బిజినెస్ తరగతిలో అందుబాటులో ఉన్న సీట్లను బట్టి .. ఎయిర్‌పోర్టులో చెక్ ఇన్‌కి ముందు మాత్రమే సీట్ల కేటాయింపు జరుగుతుంది.
స్కీము కింద 750 కిలోమీటర్ల దాకా దూరం ప్రయాణాలు చేసే వారు అప్‌గ్రేడ్ కోసం రూ. 5,000, 750 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే వారు రూ. 7,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై రూట్లో బిజినెస్ క్లాస్ టికెట్ రేటు సుమారు రూ. 25,000గా ఉంది. అయితే, చాలా ముందస్తుగా ఎకానమీ తరగతిలో చౌకగా రూ.5,000కి టికెట్ కొనుక్కున్న వారు.. అదనంగా రూ. 7,000 కట్టి బిజినెస్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫలితంగా మొత్తం చార్జీ రూ. 12,000 మాత్రమే అవుతుంది. అయినప్పటికీ సాధారణంగా బిజినెస్ తరగతి టికెట్‌కి ఉండే రేటు కన్నా ఇది సగం స్థాయిలోనే ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది. పూర్తి ఎకానమీ సర్వీసులే నడుపుతున్న కొన్ని రూట్లలో తొలి 3 వరుసలను అప్‌గ్రేడ్ చేసుకున్న ప్రయాణికులకు కేటాయించి, ప్రీమియం సర్వీసులు అందిస్తామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.