మళ్లీ టాటా గూటికి? ఎయిరిండియా... | Air India: Tata Group may buy Air | Sakshi
Sakshi News home page

మళ్లీ టాటా గూటికి? ఎయిరిండియా...

Published Thu, Jun 22 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

మళ్లీ టాటా గూటికి? ఎయిరిండియా...

మళ్లీ టాటా గూటికి? ఎయిరిండియా...

51% వాటా కొనుగోలుకు ప్రభుత్వంతో టాటా గ్రూప్‌ చర్చలు!
అమ్మేస్తామంటూ ఇప్పటికే సంకేతాలిచ్చిన కేంద్రం
ఎయిర్‌లైన్స్‌ మార్కెట్లో భారీ వాటాపై కన్ను


పోయినచోటే వెతుక్కోమన్నారు పెద్దలు! దేశీ కార్పొరేట్‌ రంగంలో విఖ్యాతి చెందిన టాటాలు కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నారు. దేశంలో మొట్టమొదటి ఎయిర్‌లైన్‌ కంపెనీని స్థాపించి, ప్రభుత్వపరం చేసిన టాటా గ్రూప్‌... ఇప్పుడు అదే ఎయిరిండియాను మళ్లీ తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి చకచకా పావులు కదుపుతోంది. తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటా అమ్మేస్తామంటూ ఇటీవల కేంద్రంలోని మోదీ సర్కారు నుంచి పదేపదే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎయిరిండియాలో నియంత్రణ వాటా (51%)ను కొనుగోలు చేసేందుకు టాటాలు ఆసక్తితో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో అనధికారిక సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వాటా విక్రయించినా, జాతీయ ఎయిర్‌లైన్స్‌గా ఎయిరిండియాను కొనసాగించాలని భావిస్తున్న కేంద్రం... టాటాల ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

గుదిబండ...
ప్రైవేటు రంగంలో ఎయిర్‌లైన్‌ కంపెనీల జోరు.. డిస్కౌంట్‌ ఆఫర్ల ప్రభావంతో నెమ్మదినెమ్మదిగా ఎయిరిండియా చతికిలపడింది. అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ప్రస్తుతం ఎయిరిండియా రుణ భారం రూ.50,000 కోట్లుగా అంచనా. దీనిలో రూ.28,000 కోట్ల మేర వర్కింగ్‌ కేపిటల్‌ రుణాలే. వడ్డీ భారం రూ.4,000 కోట్లు. అంతేకాదు 2007 తర్వాత గడిచిన పదేళ్లలో ఎయిరిండియా ఎన్నడూ లాభాలను కళ్లజూడలేదు. నష్టాలు పేరుకుపోతూనే వస్తున్నాయి. పదేళ్ల క్రితం దేశీ విమానయాన మార్కెట్లో ఎయిరిండియా వాటా 35 శాతం ఉండగా... ఇప్పుడిది 14 శాతానికి పడిపోవడం సంస్థ దుర్భర పనితీరుకు అద్దంపడుతోంది. ప్రస్తుతం 40 శాతం మార్కెట్‌ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌ 16 శాతం మార్కెట్‌ వాటాతో రెండోస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఎయిరిండియా ఉంది. దీంతో కేంద్రం ఈ గుదిబండను వదిలించుకోవడంపై దృష్టిసారించింది. పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుతోపాటు, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇతరత్రా ఉన్నతాధికారులు ఎయిరిండియా విక్రయం దిశగా పలుమార్లు సంకేతాలివ్వడం మొదలుపెట్టారు కూడా.

టాటాలకు కలిసొస్తుందా?
ఇప్పటివరకూ ఎయిరిండియాకు రూ.30 వేల కోట్ల మేర సహాయ ప్యాకేజీలను కేంద్రం ప్రకటించింది. ఇందులో దాదాపు రూ. 24,000 కోట్లు కంపెనీ అందుకుంది కూడా. అయినప్పటికీ.. పనితీరును మెరుగుపరుచుకోవడంలో దారుణంగా విఫలమైంది. గాడిలోపడకపోగా మరింత రుణాల ఊబిలోకి జారిపోయింది. మార్కెట్‌ వాటాను కోల్పోతూనే వస్తోంది. అయితే, భారీగా రుణాలున్నప్పటికీ.. ఇప్పటికీ ఎయిరిండియాకు ఉన్న 14 శాతం దేశీ మార్కెట్‌ వాటా టాటాలను ఊరిస్తోంది. అంతేకాదు భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ఎయిర్‌ట్రాఫిక్‌కు సంబంధించి 17% వాటా ఎయిరిండియా గుప్పిట్లో ఉంది.

ఇది కూడా టాటా గ్రూప్‌ను కొనుగోలుపై దృష్టిసారించేలా చేస్తోంది. కాగా, సంస్థ రుణ భారాన్ని భారీగా తగ్గించే విషయంలో ప్రభుత్వం టాటాలకు హామీనిచ్చిందని.. అందుకే వారు ఈ డీల్‌కు ఆసక్తిని కనబరుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో ప్రీమియం ఎయిర్‌లైన్స్‌ ‘విస్తార’ను టాటా గ్రూప్‌ నడుపుతోంది. అదేవిధంగా మలేసియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో జట్టుకట్టడంద్వారా చౌక ధరల ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ఏషియా ఇండియాను కూడా ప్రారంభించింది. ఈ ఎయిర్‌లైన్స్‌ ద్వారానే టాటాలు మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు కూడా. ఇప్పుడు ఎయిరిండియాను కూడా చేజిక్కించుకుంటే.. మార్కెట్‌ వాటాను గణనీయంగా దక్కించుకోవచ్చనేది టాటా గ్రూప్‌ వ్యూహం.

టాటా ఎయిర్‌లైన్స్‌ టు ఎయిరిండియా...
దేశంలో విఖ్యాత వ్యాపార సామ్రాజ్యంగా పేరొందిన టాటా గ్రూప్‌.. స్వాతంత్య్రానికి పూర్వమే మొట్టమొదటి ఎయిర్‌లైన్స్‌ కంపెనీని స్థాపించింది. టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో జేఆర్‌డీ టాటా దీన్ని నెలకొల్పారు. మొదటి విమానం ముంబై–కరాచీ నగరాల మధ్య ఎగిరింది. దీన్ని స్వయంగా జేఆర్‌డీ టాటాయే నడపడం విశేషం. అయితే, 1948 తర్వాత విదేశీ సర్వీసులను ప్రారంభించేందుకుగాను ప్రభుత్వం, ప్రైవేటు రంగంలో భాగస్వామ్యం ద్వారా దీన్ని ఎయిరిండియా ఇంటర్నేషనల్‌గా మార్చారు. ఆ తర్వాత 1953లో దేశంలోని విమానయాన వ్యాపారాలను మొత్తం జాతీయం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఎయిరిండియా టాటాల చేజారింది.

  ప్రభుత్వం ఎయిరిండియాను లాగేసుకోవడం వ్యక్తిగతంగా తనకు తీవ్ర ఎదురుదెబ్బ అని.. జేఆర్‌డీ టాటా పలుమార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు కూడా. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ... నెహ్రూ ఒత్తిడి మేరకు 1977 వరకూ ఆయనే ఎయిరిండియాకు చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పట్లో సంస్థ పనితీరు కూడా చాలా అద్భుతంగానే ఉంది. 1977లో ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ జేఆర్‌డీని ఆ పదవి నుంచి తొలగించడంతో ఎయిరిండియాతో టాటాల బంధం పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు మళ్లీ వెనక్కి తీసుకోవడానికి టాటాలకు మంచి అవకాశం లభించినట్లయింది.

ఎయిరిండియా ఆకర్షణలు ఇవీ...
భారత్‌ నుంచి వెళ్లే అంతర్జాతీయ రూట్లకు సంబంధించి ట్రాఫిక్‌లో అత్యధిక వాటా
(17%) ఎయిరిండియా చేతిలోనే ఉంది. దేశీ మార్కెట్లో వాటా 14 శాతం(మూడో స్థానం).
దేశీయంగా 72, అంతర్జాతీయంగా 42 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.
మొత్తం 140 విమానాలు ఉన్నాయి. 40 సొంత ఎయిర్‌బస్‌ ఏ320ఎస్‌ విమానాలు, 15 బోయింగ్‌ 777ఎస్‌ విమానాలు ఉన్నాయి. బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్స్‌ కూడా 23 ఉన్నాయి.
2,000 మంది పైలట్లు, 2,000 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. కేబిన్‌ సిబ్బంది సంఖ్య 4,000.
దేశంలో సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ సెంటర్‌(ఎంఆర్‌ఓ), ట్రైనింగ్‌ సెంటర్‌లు ఉన్న ఎయిర్‌లైన్స్‌ ఇదొక్కటే. బోయింగ్‌ 777, 787 సిమ్యులేటర్లు కూడా ఉన్నాయి.
భారీ స్థాయిలో అత్యంత విలువైన స్థలాలు దీని సొంతం. సెంట్రల్‌ ముంబైలో దాదాపు రూ.1,600 కోట్ల విలువచేసే 32 ఎకరాలు. న్యూఢిల్లీ వసంత్‌ విహార్‌లో 30 ఎకరాల హౌసింగ్‌ కాలనీ; లండన్, హాంకాంగ్, నైరోబి, జపాన్, మారిషస్‌లలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు.
దేశంలో అత్యధిక సంఖ్యలో 33 ఎయిర్‌క్రాఫ్ట్‌ హ్యాంగర్లు(విమానాలు నిలిపిఉంచే ప్రదేశం) ఉన్నాయి.
ప్రధాన సమయాల్లో(ఉదయం 7, 8 గంటలు ఇతరత్రా) వివిధ విమానాశ్రయాల్లో డిపార్చర్స్‌ ప్రైమ్‌ స్లాట్స్‌ ఉన్నాయి.
ఎయిర్‌మారిషస్‌లో 8 శాతం వాటా ఉంది. ఇంకా ఆరెంజ్, ఎస్‌ఐటీఏ, కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, ఏరోనాటికల్‌ రేడియో ఆఫ్‌ థాయ్‌లాండ్‌లలో షేర్లు ఉన్నాయి.
శ్రీనగర్, ఢిల్లీ నగరాల్లో సెంటార్‌ హోటళ్లు.
అతిపెద్ద ఎయిర్‌లైన్‌ గ్రూప్‌.. స్టార్‌ అలయెన్స్‌లో సభ్యత్వం.
అనేక ప్రధాన దేశాలకు విమాన సర్వీసుల హక్కులతో పాటు లండన్‌ హీత్రూ, ఫ్రాంక్‌ఫర్ట్‌ వంటి అత్యంత కీలక ఎయిర్‌పోర్టులో విలువైన ప్లయింగ్‌ స్లాట్‌లు దీని సొంతం. లండన్‌ హీత్రూలో గతేడాది ఒక స్లాట్‌ సుమారు 7.5 కోట్ల డాలర్లకు అమ్ముడైంది. ఒక్క హీత్రూలోనే ఎయిరిండియాకు 4 స్లాట్‌లు ఉన్నాయి.
ఎంఎఫ్‌ హుసేన్, ఏంజలీ ఈలా మీనన్‌ వంటి ప్రముఖ చిత్రకారుల మోడర్న్‌ ఆర్ట్‌ పెయింటింగ్స్‌ కలెక్షన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement