ఎయిరిండియా ఆస్తుల విక్రయం షురూ!
♦ వివిధ నగరాల్లోని ఫ్లాట్లు, స్థలాలు, భవంతులకు ఈ–వేలం
♦ బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ వచ్చేనెల 6
♦ రూ.500 కోట్లు లభిస్తాయని అంచనా
ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా విపరీతమైన ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఆ తరువాత ఆస్తులు మినహా ఎయిరిం డియా విమానాలను, బ్రాండ్‌ను, కార్యకలాపాలను ఏదో ఒక కంపెనీకి విక్రయించే అవకాశమున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే ఆస్తుల విక్రయం మొదలైనట్లు భావిస్తున్నారు. సంస్థకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను తాజాగా అమ్మకానికి పెట్టారు.
ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ–వేలం నిర్వహించనుండగా... బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. కంపెనీని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రక్రియకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రస్తుతం ఆర్థిక మంత్రి జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం కసరత్తు చేస్తోంది. 2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది.
మరో కింగ్‌ఫిషర్‌లా కానివ్వం: మంత్రి అశోక్
ఎయిరిండియాను మరో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లా మారనివ్వబోమని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు స్పష్టం చేశారు. ఉద్యోగులను ఇంటికి పంపాలని తాము కోరుకోవడం లేదన్నారు.