
హైదరాబాద్-శాన్‌ఫ్రాన్సిస్కో విమాన సర్వీసు
వచ్చే నెల 2 నుంచి ప్రారంభం
హైదరాబాద్: ఎయిర్ ఇండియా సంస్థ హైదారాబాద్ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు వచ్చే నెల 2 నుంచి విమాన సర్వీసును ప్రారంభించనున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా శాన్‌ఫ్రాన్సిస్కోకు నాన్ స్టాప్‌గా ఈ విమాన సర్వీసులను వారానికి మూడుసార్లు నడుపుతామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమాన ప్రయాణికుల కస్టమ్, ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలన్నీ హైదారాబాద్ విమానాశ్రయంలోనే జరుగుతాయని ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర్(హైదరాబాద్) ఏ. రాంబాబు చెప్పారు.
ప్రతి మంగళ, గురు,శనివారాల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 9.05కు బయల్దేరిన విమానం న్యూఢిల్లీకి రాత్రి 11.15కు చేరుతుందని వివరించారు. ఢిల్లీ నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజాము 2.35కు బయల్దేరి అదే రోజు తెల్లవారుజాము 6 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుతుందని పేర్కొన్నారు. ఇది ఎయిర్ ఇండియా అందిస్తున్న నాలుగో డెరైక్ట్ సర్వీసని ఇంతకు ముందు న్యూయార్క్, నెవార్క్, చికాగో నగరాలకు డెరైక్ట్ విమాన సర్వీసులను నిర్వహించామని ఆయన చెప్పారు.