ఏసీలోనే ఎయిర్ ప్యూరిఫయర్..
♦ అభివృద్ధి చేస్తున్న బ్లూ స్టార్
♦ సిటీ ప్లాంటు 2018కల్లా రెడీ
♦ కంపెనీ ఈడీ త్యాగరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి ఇటీవల ప్రవేశించిన బ్లూ స్టార్ వినూత్న ఉత్పాదనను అభివృద్ధి చేస్తోంది. ఎయిర్ ప్యూరిఫయర్‌తో కూడిన ఏసీలను రూపొందిస్తోంది. ఈ ఉత్పాదనను మూడేళ్లలో తీసుకురావాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. అలాగే సౌర విద్యుత్‌తో నడిచే ఏసీని 2017లో ప్రవేశపెడతామని బ్లూ స్టార్ ఈడీ బి.త్యాగరాజన్ తెలిపారు. నూతన శ్రేణి ఏసీలను హైదరాబాద్ మార్కెట్లో గురువారం ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డీఫ్రీజర్లు, కూలర్లను అత్యాధునిక ఫీచర్లతో తయారు చేస్తామన్నారు. 2018 నాటికి మార్కెట్లో వైఫైతో కూడిన ఏసీలే ఉంటాయని అన్నారు. ఈ మోడళ్ల ధర రానురాను తగ్గుతుందని చెప్పారు.
ప్లాటినం స్టోర్లు..: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 3.5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రానున్న ప్లాంటులో 2018 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభం కానుంది. 2017 మార్చినాటికి ఉత్పత్తి మొదలు కానున్న జమ్ము ప్లాంటు కూడా ఇంతే సామర్థ్యంతో రానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు కానున్న ఈ రెండు ప్లాంట్లకు బ్లూ స్టార్ రూ.215 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న 5 ప్లాంట్లు ఉత్తర, పశ్చిమ భారత్‌కు పరిమితమయ్యాయి. ఉత్పత్తుల ప్రదర్శనకు ప్లాటినం స్టోర్లను ఏర్పాటు చేయనుంది.
ఈ ఏడాది 15 శాతం వృద్ధి: ప్రస్తుతం రూమ్ ఏసీల విపణి భారత్‌లో 40 లక్షల యూనిట్లుంది. 2016-17లో ఇది 46-50 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘భారత్‌లో 100 గదులకుగాను నాల్గింటిలో ఏసీలున్నాయి. ఇది అయిదేళ్లలో 10 గదులకు విస్తరిస్తుంది. 50 శాతం వాటా ఉన్న మూడు, నాలుగు, అయిదవ తరగతి పట్టణాలే పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. రూమ్ ఏసీల రంగంలో బ్లూ స్టార్‌కు 10 శాతం వాటా ఉంది. 2016-17లో 12 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం. పరిశ్రమ విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా 15 శాతం నుంచి మూడేళ్లలో రెండింతలవుతుంది’ అని తెలిపారు.