దర్శకుడు పా.రంజిత్ చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అదే సమయంలో సెన్సార్ బోర్డు నుంచి సమస్యలూ ఎదురవుతుంటాయి. తాజాగా ఆయన సొంత బ్యానర్ 'నీలం ప్రొడక్షన్స్' సమర్పణలో తెరకెక్కిన బ్లూస్టార్ మూవీకి ఈ చిక్కులు తప్పలేవు. అశోక్ సెల్వన్, శాంతను, పృథ్వీ పాండియరాజన్, కీర్తిపాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జై కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెల 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
బ్లూస్టార్‌కు ఎలాంటి సమస్యలు ఉండవనుకున్నా..
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పా.రంజిత్ మాట్లాడుతూ.. నీలం ప్రొడక్షన్స్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఏదేదో ఉంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు అలర్ట్ అవుతున్నారని ఫైర్ అయ్యారు. బ్లూస్టార్ చిత్రానికి ఎలాంటి సమస్యలు రావని భావించానని, అయితే ఈ చిత్రం విడుదల కాకూడదని అక్కడే కొందరు అనుకోవడం మొదలెట్టారని చెప్పారు. అది విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు.
ఆయనను రౌడీ అన్నారు
ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించగా ఇది ఓ వర్గానికి అనుకూలంగా ఉందని చెప్పారు. నాయకుడు పూవై జగన్ మూర్తియార్ కథలా అనిపిస్తోందన్నారు. ఆయనను ఒక రౌడీగా అభివర్ణించినట్లు తెలిపారు. పూవై మూర్తియార్ తమను చదివించారని, ఆయన పెద్ద నాయకుడు అని, ఆయన్ని ఎలా రౌడీ అంటారని ప్రశ్నించానన్నారు. తాను ఎంత వాదించినా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పారు. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి అక్కడ చెప్పిన కొన్ని మార్పులు చేసి బ్లూస్టార్ రిలీజ్ చేయగా అదిప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. సమైక్యతను చాటి చెప్పే చిత్రానికి సెన్సార్ సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment