విమానయాన ఛార్జీలకు పరిమితి సరికాదు: అశోక గజపతి రాజు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు దేవదూతలు కాకపోవచ్చని, కానీ రాక్షసులు ఎంత మాత్రం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు అన్నారు. విమానయాన చార్జీలకు పరిమితి విధించడం సమస్యకు పరిష్కారం కాదని, అలా చేస్తే ప్రారంభ ధరలు పెరిగిపోతాయన్నారు. ధరలు భారీగా పెరగకుండా చూసేందుకు సులభమైన పరిష్కారం ఏదీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ... సంక్షోభ సమయాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పందిస్తూనే ఉన్నాయన్నారు. చెన్నై, శ్రీనగర్ వరద సమయాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు బాధ్యతగా వ్యవహరించి ధరలను అందుబాటులోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. విమాన చార్జీలకు గరిష్ట పరిమితి విధించే ప్రతిపాదనను ప్రభుత్వం ఏమైనా పరిశీలిస్తోందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ..ప్రభుత్వ ఉద్దేశ్యం సహేతుక ధరలు ఉంచేలా చూడడమేనని స్పష్టం చేశారు.