కొత్త ఏడాది.. 6 కొత్త ఎయిర్‌లైన్స్
రాష్ట్రాలు విమాన ఇంధన పన్నులు తగ్గించాలి
ప్రాంతీయ సర్వీసుల పెంపునకు తోడ్పడాలి
పౌర విమానయాన శాఖ మంత్రి
అశోక్ గజపతిరాజు సూచన...
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కొత్తగా ఆరు విమానయాన సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశమున్నట్లు కేంద్రం వెల్లడించింది. విమాన ఇంధనంపై అధిక పన్నులను తగ్గించడం ద్వారా ఎయిర్‌లైన్స్ కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే, ప్రాంతీయంగా విమాన సేవలను మరింతగా పెంచేందుకు కూడా సహకారం అందించాలని కోరింది. మంగళవారం వివిధ రాష్ట్రాల పౌర విమానయాన మంత్రులతో జరిగిన భేటీలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ విషయాలు వెల్లడించారు.
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. కొన్ని ఎయిర్‌లైన్స్ మాత్రం భారీ నష్టాలు చవిచూస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కొత్త సంవత్సరంలో పరిస్థితులు మరింత మెరుగుపడగలవని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. నూతన సంవత్సరంలో కొత్తగా ఆరు ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. అయితే, ఆయా సంస్థల పేర్లు మాత్రం వెల్లడించలేదు. విస్తార సంస్థ జనవరి 9 నుంచి ప్రారంభించనుండగా.. క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్, లిగేర్ ఏవియేషన్ తదితర సంస్థలకు కేంద్రం ఈ ఏడాదే పర్మిట్లు ఇచ్చింది.
విమాన సేవలను విస్తృతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందించాలని, పన్నులు తగ్గించాల్సిన అవసరాలను గుర్తించాలని అశోక్ గజపతిరాజు సూచించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఇందుకు అంగీకరించాయన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు అందించేందుకు హెలికాప్టర్ వినియోగం పెరగాలని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇటీవలి కాలంలో హెలికాప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య ఏమాత్రం పెరగలేదని చెప్పారు. అధిక విమాన ఇంధనం ధరలు, సర్వీస్ ట్యాక్సులు, ఇతరత్రా చార్జీలతో విమానయాన సంస్థల నిర్వహణ భారం భారీగా ఉంటోందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల దిగుమతిపైనా కస్టమ్స్ సుంకాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని, విమానాశ్రయాల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం ప్యాకేజీపై కసరత్తు చేస్తోందని అశోక్ గజపతిరాజు చెప్పారు.
స్పైస్‌జెట్ కష్టాలు.. అదే పరిష్కరించుకోవాలి..
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్ తన సమస్యలను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కంపెనీ గట్టెక్కే ప్రక్రియలో అవసరమైతే ప్రభుత్వం తన వంతుగా కొంత మేర సహాయం మాత్రమే అందించగలదన్నారు. మరోవైపు స్పైస్‌జెట్ కొన్ని ఫ్లయిట్ల రద్దును జనవరి 31 దాకా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కనీసం 329 ఫ్లయిట్లపై ప్రభావం పడనుంది. ఈ నెలాఖరు దాకా స్పైస్‌జెట్ 1,800 ఫ్లయిట్లు రద్దు చేసింది. తాజాగా సంస్థ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 300 పైచిలుకు ఫ్లయిట్లను వచ్చే నెల 31 దాకా రద్దు చేసింది.
2016లో ఎయిర్‌లైన్స్‌కి మళ్లీ కళ: క్రిసిల్ నివేదిక
ముంబై: దేశీ విమానయాన సంస్థలు 2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,100 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించగలవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,500 కోట్ల మేర నష్టాలు నమోదు చేసిన ఎయిర్‌లైన్స్ అప్పటికి మళ్లీ కోలుకోగలవని వివరించింది. అయితే..ఎయిరిండియా, జెట్, స్పైస్ జెట్ వంటి సంస్థలు నికర లాభం నమోదు చేయడానికి ఇంకా సమయం పట్టేస్తుందని క్రిసిల్ తెలిపింది. ఏకంగా రూ. 35,000 కోట్ల మేర భారీగా పెట్టుబడులు పెడితే గానీ ఇది సాధ్యపడదని వివరించింది.
దీర్ఘకాలికంగా చూస్తే భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థల వ్యాపార నిర్వహణకు మెరుగైన పరిస్థితులు ఏర్పడగలవని తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గుతుండటం వల్ల 2013-14తో పోలిస్తే 2015-16లో విమాన ఇంధనం ధరలు 25 శాతం తక్కువ స్థాయిలో ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ఇక కొత్త కంపెనీలు సేవలు ప్రారంభించినప్పటికీ.. పోటీ ఒక మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ రీసెర్చ్ సీనియర్ డెరైక్టర్ ప్రసాద్ కొపార్కర్ వివరించారు. ఆర్థికపరమైన ఒత్తిడి కారణంగా ఇప్పుడున్న ఎయిర్‌లైన్స్ కొత్తగా మరిన్ని విమానాలను కొనుగోలు చేయకపోవచ్చని తెలిపారు.