టెల్కోల తాజా ప్రతిపాదన: ఇక కాల్ రేట్లు మోత
ప్రస్తుతం మార్కెట్‌లో టెలికాం కంపెనీలు ఆఫర్ చేస్తున్న కాల్ రేట్లు ఇక మోతమోగనున్నాయి. ఇప్పటివరకున్న ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ ఛార్జీలను(ఐయూసీ) రెండింతలు పెంచాలని టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు ప్రతిపాదించాయి.
న్యూఢిల్లీ : ప్రస్తుతం మార్కెట్‌లో టెలికాం కంపెనీలు ఆఫర్ చేస్తున్న కాల్ రేట్లు ఇక మోతమోగనున్నాయి. ఇప్పటివరకున్న ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ ఛార్జీలను(ఐయూసీ) రెండింతలు పెంచాలని టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు ప్రతిపాదించాయి. మొబైల్ కాల్ రేట్లకు ఐయూసీ కీలక ఇన్‌పుట్. తమ నెట్‌వర్క్‌లకు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌ను టర్మినేట్ చేయడానికి నిమిషానికి 30 పైసలు వసూలుచేయాలని నిర్ణయించాలని ఈ దిగ్గజాలు చెప్పాయి. మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ కూడా ఈ రేటును ప్రస్తుతమున్న దానికంటే రెండింతలు ఎక్కువగా 34 పైసలుగా ప్రతిపాదించింది. ఈ ప్రభావం డైరెక్ట్‌గా మొబైల్ కాల్ రేట్లపై పడనుందని తెలుస్తోంది. ఐయూసీలో ఎలాంటి మార్పు వచ్చిన తొలుత ప్రభావితమయ్యేది మొబైల్ కాల్స్ రేట్లే. ఈ ఛార్జీలతోనే టెలికాం కంపెనీలు టారిఫ్‌లను నిర్ణయిస్తాయి.
టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ నిర్వహించిన ఐయూసీ రివ్యూ వర్క్‌షాపులో ఈ ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించినట్టు టెలికాం ఆపరేటర్లకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ప్రతి ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్షన్ ఛార్జీ కింద వీటిని వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు మొబైల్ సబ్‌స్క్రైబర్లు చెల్లించే ఛార్జీల్లోనే కలిసి ఉంటాయి. ఐయూసీను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ నిర్ణయిస్తోంది. ప్రస్తుతం ప్రతి ఇన్‌కమింగ్ కాల్‌కు నిమిషానికి 14 పైసల ఐయూసీ ఉంది. ఈ రేట్ల పెంపుతో టెలికాం ఆపరేటర్లు ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్ లోడ్ వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ట్రాయ్ నిర్వహించిన సమావేశంలో టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో కూడా పాల్గొంది. అయితే ఇన్‌కమింగ్ కాల్స్‌పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని జియో పోరాడుతోంది.
-
ఎయిర్‌టెల్ ఒక్కో ఇన్‌కమింగ్ కాల్ నిర్వహించడానికి అయ్యే వ్యయాలు 30 పైసలుగా పేర్కొంది. దీంతో ఐయూసీని పెంచాలని డిమాండ్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐయూసీ పెంపుతో ఈ వ్యయాలను అది రికవరీ చేసుకోవాలని చూస్తోంది.
-
వొడాఫోన్‌కు కూడా ఈ వ్యయాలు 30 పైసలవుతున్నాయి. దీనిలో లైసెన్సు ఫీజులను కలుపలేదు. లైసెన్సు ఫీజులను కలిపితే ఒక్కో ఇన్‌కమింగ్ కాల్‌కు 34 పైసల ఖర్చవుతుంది.
-
ట్రాయ్ మెథడాలజీ ప్రకారం ఐడియా సెల్యులార్‌కి కూడా ఒక్కో ఇన్‌కమింగ్ కాల్ నిర్వహించడానికి సమారు 30 పైసలు ఖర్చవుతోంది. దాని లెక్కల ప్రకారం ఇది 35 పైసలుగా ఉంది.