మెగా స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధం
• దరఖాస్తులు సమర్పించిన టెల్కోలు
• జాబితాలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో
• వచ్చే నెల 1 నుంచి బిడ్డింగ్...
న్యూఢిల్లీ: అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న మెగా స్పెక్ట్రమ్ వేలానికి అప్పుడే సందడి మొదలైంది. ప్రధాన టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా టెలీలు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. దరఖాస్తుదారుల వివరాలను గురువారం టెలికం శాఖ ప్రకటించనుంది. ఈ వేలంలో రూ.5.63 లక్షల కోట్ల రూపాయల విలువైన రేడియో తరంగాలను కేంద్రం వేలం వేయనుంది. వేలంలో టెల్కోలు ఉత్సాహంగా పాల్గొంటాయని ఆశిస్తున్నట్టు టెలికం మంత్రి మనోజ్ సిన్హా ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. కాగా టెలినార్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ఈ వేలంలో పాల్గొనడం లేదు.
భారీగా పెరగనున్న టెల్కోల రుణాలు
వేలంలో 700, 800, 900, 1,800, 2,100, 2,300 మెగాహెడ్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ విక్రయానికి రానుంది. వీటిలో 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ వేలానికి పెట్టడంఇదే తొలిసారి. ఈ ఒక్క బ్యాండ్‌లోనే రూ.4 లక్షల కోట్ల మేరకు బిడ్లు వస్తాయనేది ప్రభుత్వం అంచనా. ‘టెలికం పరిశ్రమ నికర రుణాలు 2015 డిసెంబర్ నాటికి రూ.3.8 లక్షల కోట్లు. అక్టోబర్ 1 నాటి వేలంలో పాల్గొనడం ద్వారా పరిశ్రమ రుణ భారం రూ.4.6 లక్షల కోట్లకు పెరగనుంది’ అని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనావేసింది.
కాల్ ట్రాఫిక్ వివరాలు ఇవ్వండి..: ట్రాయ్
కాల్స్ ట్రాఫిక్ వివరాలివ్వాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను బుధవారం ఆదేశించింది. ఇంటర్ కనెక్ట్ అంశంపై జియో ఆరోపణలు, బీఎస్‌ఎన్‌ఎల్‌పై సీఓఏఐ ఫిర్యాదు నేపథ్యంలో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.