స్పెక్ట్రమ్ వేలం కోసం...రూ.15వేల కోట్లు జమ | Reliance Jio launch may disrupt spectrum auction: govt official | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రమ్ వేలం కోసం...రూ.15వేల కోట్లు జమ

Published Sat, Sep 17 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

స్పెక్ట్రమ్ వేలం కోసం...రూ.15వేల కోట్లు జమ

స్పెక్ట్రమ్ వేలం కోసం...రూ.15వేల కోట్లు జమ

టెల్కోల్లో రిలయన్స్ జియో ముందంజ..
రూ.6,500 కోట్లు డిపాజిట్

 న్యూఢిల్లీ: అక్టోబర్ 1నాటి మెగా స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు ఏడు టెలికం కంపెనీలు రూ.15వేల కోట్లను ధరావతు సొమ్ము (ఈఎండీ) కింద కేంద్రానికి జమ చేసినట్టు తెలుస్తోంది. గతేడాది స్పెక్ట్రమ్ వేలం సమయంలో వచ్చిన ధరావతు సొమ్ము రూ.20,435 కోట్లు కంటే ఇది తక్కువగా ఉండడం గమనార్హం. అయితే, స్పెక్ట్రమ్ స్థాయికి, ధరావతు సొమ్ముకు పోల్చి చూడరాదని టెలికం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.6,500 కోట్లు జమ చేసింది.

వొడాఫోన్ రూ.2,800 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.2,000 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.1,900 కోట్లు డిపాజిట్ చేశాయి. మిగిలిన మొత్తం టాటా టెలీ, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ నుంచి వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు ఏ బ్యాండ్‌లో, ఏ సర్కిల్‌లో బిడ్లు వేయనున్నదీ ధరావతు సొమ్ము సూచిస్తుంది. జియో ఎక్కువగా డిపాజిట్ చేయడంతో మిగిలిన కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  

 త్వరలో ప్రారంభం కానున్న వేలంలో రూ.5.63 లక్షల కోట్ల రూపాయల విలువైన రేడియో తరంగాలను కేంద్రం వేలం వేయనుంది. 700, 800, 900, 1,800, 2,100, 2,300 మెగాహెడ్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకునేందుకు టెలికం కంపెనీలు పోటీ పడనున్నాయి. వీటిలో 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ వేలానికి రావడంఇదే మొదటిసారి. ఒక్క ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్‌పైనే రూ.4 లక్షల కోట్ల మేరకు బిడ్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా, టెలినార్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ఈ వేలంలో పాల్గొనడం లేదు. స్పెక్ట్రమ్, ఇతర లెవీల ద్వారా టెలికం శాఖ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.98,995 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement