మెగా స్పెక్ట్రం వేలం..!
కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర..
♦ ఖజానాకు రూ. 5.66 లక్షల కోట్లు..!
♦ 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రికార్డు
♦ రిజర్వు ధర రూ.11,485 కోట్లు
♦ సెప్టెంబర్‌లో వేలం ఉండొచ్చని అంచనా...
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో మెగా స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్ అయింది. మొత్తం ఏడు రకాల బ్యాండ్‌విడ్త్‌లలో తాజాగా స్పెక్ట్రంను విక్రయించే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.5.66 లక్షల కోట్లు జమవుతాయని అంచనా. ప్రధానంగా హైస్పీడ్ 4జీ డేటా, వాయిస్ సేవలను టెల్కోలు విస్తరించేందుకు ఈ స్పెక్ట్రంతో వీలవుతుంది. దేశ చరిత్రలో అతిపెద్ద స్పెక్ట్రం వేలంగా ఇది నిలవనుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. వేలం ఎప్పుడుంటుందనేది మాత్రం అయన వెల్లడించలేదు. అయితే, సెప్టెంబర్‌లో వేలం ఉంటుందని టెలికం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎస్‌యూసీపై మళ్లీ ట్రాయ్ సమీక్ష...
టెల్కోలు చెల్లించే స్పెక్ట్రం వినియోగ చార్జీ(ఎస్‌యూసీ) నిర్ణయానికి సంబంధించిన అంశాన్ని సమీక్షించేందుకు మళ్లీ ట్రాయ్‌కు పంపనున్నట్లు జైట్లీ చెప్పారు. అన్ని టెల్కోలకూ ఒకేవిధంగా(యూనిఫామ్) 3 శాతం(కంపెనీల వార్షిక ఆదాయంలో) ఎస్‌యూసీని ట్రాయ్ ప్రతిపాదించింది. దీన్ని క్రమంగా 1 శాతానికి తగ్గించాలని సూచించింది. అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ(టెలికం కమిషన్) కూడా దీనికి ఓకే చెప్పింది.
అయితే బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్(బీడబ్ల్యూఏ) సేవల కంపెనీలకు(ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇన్ఫోకామ్ ఇతరత్రా) ఇప్పుడున్న 1 శాతం ఎస్‌యూసీని 3 శాతానికి పెంచడంపై ప్రభుత్వ ముఖ్య న్యాయాధికారి(ఏజీ) ముకుల్ రోహత్గి వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఏజీ అభిప్రాయాన్ని పరిశీలించి ట్రాయ్ మళ్లీ తమకు సిఫార్సులను అందిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ఇక తాజా వేలం ద్వారా లభించే స్పెక్ట్రంను కంపెనీలు విక్రయించుకునేందుకు(ట్రేడింగ్) లాకిన్ వ్యవధిని ఇప్పుడున్న 3 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించనున్నారు. ఏడు బ్యాండ్‌లలో కలిపి 2,300కు పైగా మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలంలో అందుబాటులో ఉంచనున్నారు.
700 మెగాహెర్ట్జ్‌తో కాసుల పంట...!
టెలికం సేవలకు అత్యంత సమర్థవంతమైన(ప్రీమియం) బ్యాండ్‌విడ్త్‌గా చెబుతున్న 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వేలం ద్వారా ఈసారి ఖజానాకు కాసుల పంట పండనుంది. నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు ఈ బ్యాండ్‌లో ఒక్కో మెగాహెర్ట్జ్‌కు(దేశవ్యాప్తంగా) రిజర్వు(వేలం ప్రారంభ ధర) రేటును రికార్డు స్థాయిలో రూ.11,485 కోట్లుగా నిర్ణయించారు. దీని ప్రకారం ఏదైనా కంపెనీ దేశవ్యాప్తంగా(అన్ని సర్కిళ్లలో సేవలు అందించేందుకు) 5 మెగాహెర్ట్జ్ బ్లాక్‌ను దక్కించుకోవాలంటే కనీసం రూ.57,425 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఒక్క బ్యాండ్‌విడ్త్‌లోనే రూ.4 లక్షల కోట్లకు పైగా బిడ్‌లు వస్తాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం 3జీ సేవలకు అత్యధికంగా టెల్కోలు వినియోగిస్తున్న 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్‌తో పోలిస్తే 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో మొబైల్ సేవలు అందించేందుకు అయ్యే వ్యయం 70 శాతం మేర తక్కువగా ఉంటుందని అంచనా. అందుకే దీన్ని ప్రీమియం బ్యాండ్‌గా విభజించి రికార్డు రేటును నిర్ణయించారు. స్పెక్ట్రం వేలం తర్వాత తక్షణ చెల్లింపుల ఈ ఏడాదే ఖజానాకు రూ.64,000 కోట్లు ఖజానాకు జమవుతాయని అంచనా. ఇక ఇతర రుసుములు, పన్నుల రూపంలో మరో రూ.98,995 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారు.
మొత్తంమీద ఈసారి జరిగే వేలం ద్వారా ఖజానాకు సుమారు రూ.5.66 లక్షల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 2014-15 ఏడాదిలో దేశీ టెలికం పరిశ్రమ మొత్తం ఆదాయం రూ.2.54 లక్షల కోట్లతో పోలిస్తే.. తాజా బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వానికి రెట్టింపునకు పైగా ఆదాయం లభించనుండటం గమనార్హం. 2015 మార్చిలో జరిగిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.1 లక్షల కోట్లు సమకూరింది.
టెలికం దిగ్గజాల గగ్గోలు...
700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రంను వినియోగించి సేవలందించే స్థాయిలో తగిన వ్యవస్థ ఇంకా దేశంలో లేదని.. అందువల్ల దీనికి సంబంధించిన వేలాన్ని వాయిదా వేయాలంటూ దిగ్గజం టెలికం కంపెనీలన్నీ ఇప్పటికే కోరాయి. ఒక వేళ స్పెక్ట్రం కొనుగోలు చేసినా చాలా ఏళ్లపాటు దీన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోవడంవల్ల పరిశ్రమ నిధులన్నీ బ్లాక్ అయిపోయేందుకు దారితీస్తుందని టెల్కోలు వాదిస్తున్నాయి. కాగా, 1,800, 2,100, 2,300 మెగాహెర్ట్జ్ వంటి అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో స్పెక్ట్రం దక్కించుకున్న కంపెనీలు తుది బిడ్డింగ్ ధరలో 50 శాతాన్ని వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రెండేళ్ల గడువు(మారటోరియం) తర్వాత పదేళ్ల పాటు చెల్లించవచ్చు. గతంలో జరిగిన వేలాల్లో ముందుగా 33% మొత్తాన్ని చెల్లించేందుకు అనుమతించారు.
స్టార్టప్స్‌కు రూ.10,000 కోట్ల నిధి..
న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు ప్రకటించింది. రూ.10,000 కోట్లతో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్(ఎఫ్‌ఎఫ్‌ఎస్)’ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మూలనిధి(కార్పస్) పూర్తిస్థాయిలో అందుబాటులోకివస్తే... 18 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు వీలవుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ఈక్విటీ పెట్టుబడుల రూపంలో రూ.60,000 కోట్లు, రుణ సాధనాల రూపంలో(డెట్) దీనికి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు స్టార్టప్ సంస్థల్లోకి వచ్చేందుకు దోహదం చేస్తుందని తెలిపింది.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ)లో ఈ నిధిని ఏర్పాటు చేయనున్నారు. సెబీ వద్ద నమోదైన ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్)కు సిడ్బీ ఈ నిధులను అందజేస్తుంది. అంతిమంగా స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల ద్వారా పెట్టుబడి నిధులు సమకూరుతాయని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆవిష్కరించిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్’కు అనుగుణంగా ఈ నిధిని ప్రకటించారు. 14, 15 ఆర్థిక సంఘం కాలావ్యవధిలో(నిధుల లభ్యత, స్కీమ్ పురోగతికి అనుగుణంగా) ఈ కార్పస్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, 2016-17కు గాను రూ.600 కోట్ల మొత్తాన్ని ఎఫ్‌ఎఫ్‌ఎస్ కోసం ప్రభుత్వం కేటాయించింది.