సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ సదుపాయం ద్వారా మనకు కావాల్సిన పాటలు, వార్తలు, జోకులు ఎల్ల వేళలా వినేందుకు అమెజాన్ కంపెనీ (అమెజాన్ వాయిస్ అసిస్టెంట్) ‘అలెక్సా’ యాప్ కలిగిన ‘అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదే అమెజాన్ కంపెనీ ‘వైర్ లెస్ ఎకో ఇయర్ బడ్స్’ను తీసుకొస్తోంది. దీనికి కూడా ‘వాయిస్ కమాండ్స్’ను రిసీవ్ చేసుకొనే ‘అలెక్సా’ను అనుసంధానించింది. ‘అలెక్సా!’ అని సంబోధించడం ద్వారా మనం కోరిన పాట, వార్తలు లేదా జోక్స్‌ను ఇంటర్నెట్‌లో వెతుక్కొని అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో (కమాండింగ్‌తో) పనిచేసే వైర్ అవసరం లేని ఇయర్ బడ్స్‌ను తీసుకొస్తోంది.
ఆ ఇయర్ బడ్స్‌ను మనం చెవిలో పెట్టుకొని ‘అలెక్సా’ అంటూ కమాండ్ ఇస్తే చాలు, దానికి అనుగుణంగా స్పందించి మనం కోరింది ఇంటర్నెట్‌లో వెతికి ఇయర్ బడ్స్ ద్వారా వినిపిస్తోంది. ఒక ఇంట్లోనే కాకుండా మనం బయటకు వాహ్యాళికి వెళ్లినప్పుడు, బస్సో, రైలో ఎక్కినప్పుడు ఈ ఇయర్ బడ్స్ ద్వారా పాటలు లేదా వార్తలు వినవచ్చు. అయితే బయటకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం కోసం స్మార్ట్ ఫోన్ వెంట ఉండాల్సిందే. లేకపోతే ‘వైఫై’ సదుపాయం ఉన్న హోటల్‌నో, కేఫ్‌నో, మరో చోటునో ఆశ్రయించాల్సి ఉంటుంది. రోడ్డు మీద వినిపించే రణగొణ ధ్వనులను తగ్గించేందుకు ప్రఖ్యాత ‘బోస్’ కంపెనీ రూపొందించిన ‘నాయిస్ రిడక్షన్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఇయర్ బడ్స్‌లో ఉపయోగించారు.
ఇందులో ప్రతి బడ్‌కు రెండు స్పీకర్లు బయటకు, ఒక స్పీకర్ లోపలికి చొప్పున సెట్‌కు ఆరు స్పీకర్లు ఉంటాయి. బయటకు ఉండే రెండేసీ స్పీకర్లు మనకు వినిపించడానికైతే ఒకటేసి స్పీకర్ ‘అలెక్సా’ మన అడిగింది వినడానికి. దీని వల్ల బిజీ రోడ్లో ప్రయాణిస్తున్నా, గోల గోలగా ఉండే రైల్వే స్టేషన్లో ఉన్నా ‘అలెక్సా’ సులభంగా మన కమాండ్‌ను వినగలదు. ఈ ఏడాది చివరిలో తీసుకరానున్న ‘అమెజాన్ ఎక్ ఇయర్ బడ్స్’కు 129.99 డాలర్లు (దాదాపు పదివేల రూపాయలు)గా ధరను ఖరారు చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో 160 డాలర్లకు అందుబాటులో ఉన్న ఇలాంటి ఇయర్ బడ్స్ ‘ఆపిల్స్ ఏర్ పాడ్స్’కు పోటీగా అమెజాన్ కంపెనీ తీసుకొచ్చింది. త్వరలో అలెక్సా తరహాలో పనిచేసే ఆపిల్ కంపెనీ ‘సిరి’, గూగుల్ కంపెనీ ‘గూగుల్ అసెస్టెంట్’లకు కూడా ఈ ఇయర్ బడ్స్‌ను అనుసంధానిస్తామని అమెజాన్ కంపెనీ వర్గాలు తెలిపాయి.
మన వెంట ఉండే స్మార్ట్ ఫోన్‌లో అలెక్సా, సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ ఉన్నప్పుడు ఇయర్ బడ్స్‌లో లేకపోయినా మనం కోరింది వినవచ్చుగదా! అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. రణగొణ ధ్వనుల మధ్య ఫోన్ మైక్ నోటి దగ్గర పెట్టుకొని మనం కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన గొంతుకన్నా బయటి ధ్వనులు ఎక్కువగా ఉన్నప్పుడు అలెక్సా....స్పందించకపోవచ్చు. అందుకనే ఈ ఇయర్ బడ్స్‌లో ‘నాయిస్ రిడక్షన్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. కొంత ఈ వాదన కరెక్టే అయినా. ‘అన్నింట్లో అన్ని సౌకర్యాలు’ అనేది ఆధునిక సాంకేతిక వ్యాపార సూత్రం.
Comments
Please login to add a commentAdd a comment