
అల్యూమిల్‌తో వేల్యూలైన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ శానిటరీ ఉత్పత్తుల సంస్థ వేల్యూలైన్ తాజాగా గ్రీస్‌కి చెందిన అల్యూమినియం ఉత్పత్తుల దిగ్గజం అల్యూమిల్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద అల్యూమిల్ ఉత్పత్తులను వేల్యూలైన్ భారత మార్కెట్లో అందిస్తుంది. ముడి సరుకును దిగుమతి చేసుకుని స్థానిక అవసరాలకు తగినట్లుగా తమ ప్లాంట్‌లో ఫ్యాబ్రికేషన్ చేసి అందించనున్నట్లు గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వేల్యూలైన్ సీఎండీ నరీందర్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా నిర్మాణాల్లో అల్యుమినియం వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో తమ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి మై హోమ్, ఫీనిక్స్ కన్‌స్ట్రక్షన్స్ తదితర రియల్టీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆనంద్ ఈ సందర్భంగా చెప్పారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాల్లో ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు అల్యూమిల్ చైర్మన్ జార్జ్ అలెక్స్ మిలోనాస్ తెలిపారు. అంతర్జాతీయంగా అల్యూమినియం ఆర్కిటెక్చర్ పరిశ్రమలో ప్రీమియం సెగ్మెంట్‌లో వార్షిక వినియోగం 2 లక్షల పైగా టన్నులు ఉంటోం దని, ఇందులో తాము దాదాపు 35,000 టన్నుల మేర ఉత్పత్తుల్ని అందిస్తున్నామని తెలిపారు. భారత్‌లో మూడేళ్ల నుంచీ తమ కార్యకలాపాలున్నాయని, డిమాండ్‌ను బట్టి ఇక్కడా తమ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారాయన.