‘క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట అబ్బాయిల నోట వినిపిస్తే అభినందనలు తెలుపుతారు. ఆశీర్వదిస్తారు. అదే మాట అమ్మాయిల నోటి నుంచి వినిపిస్తే..? అవాక్కవుతారు. ‘అమ్మాయిలకు క్రికెట్ ఎందుకు?’ అని కూడా అంటారు. లక్ష్యం మీద గురి పెట్టిన వారు మాత్రం అలాంటి మాటలను లక్ష్యపెట్టరు. అలాంటి ఒక అమ్మాయి శ్రీవల్లి. ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నెరవేర్చుకున్న శ్రీవల్లి క్రికెట్‌లో రాణిస్తోంది. డిసెంబరు 4 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో బీసీసీఐ సీనియర్ మహిళల జట్టులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
శ్రీవల్లికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం టీవీలో వీక్షణకే పరిమితం కాలేదు. చిన్న వయసులోనే బాల్, బ్యాట్‌తో గ్రౌండ్‌లో అడుగు పెట్టేలా చేసింది. శ్రీవల్లి అయిదవ తరగతి చదువుతున్న రోజుల్లో... స్కూల్ ప్లే గ్రౌండ్‌కు వెళ్లింది. హైస్కూల్ అబ్బాయిలు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ‘అన్నా... నేను కూడా ఆడతాను’ అని అడిగింది చిన్నారి శ్రీవల్లి. వాళ్లు బిగ్గరగా నవ్వారు.
ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘అయిదో క్లాసు అమ్మాయి హైస్కూల్ అబ్బాయిలతో ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. ‘ఆడపిల్లలు క్రికెట్ ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. వారి వెటకారపు నవ్వులతో వెనక్కి వెళ్లిపోలేదు శ్రీవల్లి. పీఈటీ రహీం సార్‌కు చెప్పింది. ‘నీ ఉత్సాహం సరే, వారితో ఆడగలవా?’ అని అడిగారు సార్. ‘ఆడతాను’ అని ఉత్సాహంతో తల ఊపింది.
నిజానికి అది ఉత్సాహం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన తొలి సంకేతం. విజయపథం వైపు వేసిన తొలి అడుగు. శ్రీవల్లి చేసిన బౌలింగ్‌లో సీనియర్లు షాట్లు బాగానే కొట్టారు. కానీ, తన స్పీడ్‌కు కొందరు బెంబేలెత్తడం పీఈటీ సార్ గమనించారు. లైన్ లెంగ్త్ సరిదిద్దితే శ్రీవల్లిని బాగా తీర్చిదిద్దవచ్చు అని గుర్తించారు. అక్కడ నుంచి తానే కోచ్‌గా మారారు. శ్రీవల్లి బౌలింగ్‌లోని లోపాలను సరిచేస్తూ క్రమంగా స్పీడ్‌బౌలర్‌గా తీర్చిదిద్దారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని శ్రీవల్లి తల్లిదండ్రులకు చె΄్పారు.
‘క్రికెట్ అంటే ఏదో సరదాగా ఆడుతోంది కానీ అమ్మాయిని డాక్టర్‌గా చూడాలనేది మా కల’ అని వారు అని ఉంటే శ్రీవల్లి కల ఆవిరైపోయేది. అయితే సార్ మాట విని శ్రీవల్లి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కుమార్తెకు మరింత సాధన అవసరమనుకున్న తండ్రి లక్షా్మరెడ్డి శ్రీవల్లిని హైదరాబాద్ పంపాడు.
‘పై చదువుల కోసమో, ఎంసెట్ కోచింగ్ కోసమో పిల్లల్ని హైదరాబాద్‌కు పంపిస్తారుగానీ క్రికెట్ కోచింగ్ కోసం పంపిస్తున్నావా!’ అని బోలెడు ఆశ్చర్యపడిన వాళ్లు... ‘క్రికెట్‌లో ఎవరికో ఒకరికి అదృష్టం దక్కుతుంది. ఆడినవాళ్లందరూ స్టార్‌లు కాలేరు’ అని నిరాశపరిచిన వాళ్లూ్ల ఉండొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వచ్చినా ఆ తల్లిదండ్రులకు బాగా నచ్చిన మాట...‘మీ అమ్మాయికి క్రికెట్‌లో మంచి భవిష్యత్ ఉంది’
హైదరాబాద్‌లో కనిష్కనాయుడు శిక్షణలో క్రికెట్‌లో తన నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది శ్రీవల్లి. ఫాస్ట్‌బౌలర్‌గానే కాకుండా, బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోగల ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.బాల్యంలోనే పెద్ద కలలు కన్న శ్రీవల్లి టీనేజ్‌లో ఆ కలలను తన సాధనతో మరింత సాకారం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలనేది శ్రీవల్లి లక్ష్యం. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. – అనిల్ కుమార్ భాషబోయిన సాక్షి ప్రతినిధి, కరీంనగర్
ఆ స్ఫూర్తితోనే...
అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి రకరకాల పరిమితులు ఉండొచ్చు. అయితే ఆడాలనే ఉత్సాహంతోపాటు సంకల్పబలం ఉంటే ఆ పరిమితులు మనకు అడ్డుకావు. ఎంతోమంది స్టార్ క్రికెట్ ప్లేయర్‌ల అపూర్వ విజయాలతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాను. ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలనేది నా కల. – కట్టా శ్రీవల్లి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment