ఈ ఏడాదే అమర రాజా... బిలియన్ డాలర్ క్లబ్‌లోకి!
రూ. 600 కోట్లతో విస్తరణ
⇒ ఉత్తర, పశ్చిమ భారత్‌లో యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
⇒ అమర రాజా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా
చిత్తూరు నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఈ ఏడాది బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరగలమన్న ధీమాను అమర రాజా గ్రూపు వ్యక్తం చేసింది. గడిచిన ఏడాది తమ గ్రూపు వ్యాపార పరిమాణం రూ. 5,600 కోట్లు దాటిందని, ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో వ్యాపార పరిమాణం బిలియన్ డాలర్ల ( సుమారు రూ.6,300 కోట్లు) మార్కును అందుకోగలమన్న ధీమాను అమర రాజా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా వ్యక్తం చేశారు.
చిత్తూరులో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అమర రాజా గ్రోత్ కారిడార్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది విస్తరణ కోసం రూ. 550 కోట్లు వ్యయం చేయగా, ఈ ఏడాది రూ. 600 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన గ్రోత్ కారిడార్‌లో తమ గ్రూపు 150 ఎకరాల వరకు వినియోగించుకొని మిగిలిన ఎకరాలను అభివృద్ధి చేసి ఇతర కంపెనీలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రెట్టింపు కానున్న ద్విచక్ర బ్యాటరీ యూనిట్
ద్విచక్ర వాహన బ్యాటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 11 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యానికి అదనంగా మరో 11 మిలియన్ యూనిట్లు కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంతోపాటు ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని, నిర్వహణ పరంగా తక్కువ వ్యయం ఉన్న చోట ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఇంకా 18 నెలల సమయం ఉన్నందున పెట్టుబడి వ్యయం గురించి చెప్పలేమన్నారు. ద్విచక్ర వాహన తయారీ కంపెనీలకు నేరుగా బ్యాటరీలను అందించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, ఇప్పటికే హోండా, మహీంద్రా వాహనాలకు అందిస్తుండగా, త్వరలోనే బజాజ్, హీరో గ్రూపులతో ఒప్పందాలు కుదరనున్నట్లు తెలిపారు.
ఎగుమతులపై దృష్టి
ఎగుమతులపై దృష్టి సారిస్తున్నట్లు అమర రాజా ప్రకటించింది. హిందూ మహా సముద్ర తీర దేశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు రామచంద్ర నాయుడు తెలిపారు. ఇప్పటికే సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లో పట్టు సాధించామని, మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, కువైట్, ఆఫ్రికా దేశాల్లోకి విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో సుమారు 15 శాతం ఎగుమతులు ద్వారా సమకూరుతోంది.
డిసెంబర్ నాటికి ట్యూబులర్ యూనిట్
రూ. 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న హోమ్ ఇన్వర్టర్ బ్యాటరీ ‘ట్యూబులర్’ యూనిట్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో పాటు ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ బ్యాటరీ యూనిట్లను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ బ్యాటరీ యూనిట్ సామర్థ్యం 2 బిలియన్ ఎంఏహెచ్‌గా ఉందని, దీన్ని వచ్చే ఒకటి రెండేళ్ళలో 2.4 బిలియన్ ఎంఏహెచ్‌కు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే 10 మిలియన్ యూనిట్లుగా ఉన్న ఆటోమోటివ్ యూనిట్ సామర్థ్యాన్ని రెండేళ్లలో 16 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.