సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది.
ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.
ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి
మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను
ప్రారంభిస్తామన్నారు.
(చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ)
Comments
Please login to add a commentAdd a comment