
ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా జుకర్‌బర్గ్ రికార్డు్
సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్‌లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది.
ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్‌మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్‌మీడియాలతోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే.
చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్‌వీఎంహెచ్‌సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment