ఆఫర్లతో అమెజాన్ వెబ్‌సైట్ క్రాష్
ముంబై: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్ శుక్రవారం క్రాష్ అయిందని సమాచారం. ఈ సంస్థ దివాళి ధమాకా పేరుతో శుక్రవారం నుంచి ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభించింది. వారం రోజుల పాటు ఈ అమ్మకాలుంటాయని కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే ఆఫర్‌లాగానే ఈ అమెజాన్ ఆఫర్లు కూడా కస్టమర్లకు చేదు అనుభవాలనే మిగిల్చాయని వార్తలు వచ్చాయి.
ఉదయం 7 గంటల నుంచే అమ్మకాలుంటాయని అమెజాన్‌డాట్‌ఇన్ పేర్కొంది. మంచి ఆఫర్లుంటాయనే అంచనాలతో పలువురు ఈ సైట్‌ను ఓపెన్ చేయడంతో ఈ వెబ్‌సైట్ క్రాష్ అయిందని సమాచారం. ప్రారంభంలో చాలా మందికి డీల్స్ కనిపించలేదు. కనిపించిన డీల్స్ కూడా ఆసక్తికరంగా, ఆశించిన విధంగా లేవని వార్తలు వచ్చాయి.
ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డే ఆఫర్‌లాగానే డీల్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డీల్స్ ఉంటాయని ప్రచారం జరిగింది. కాగా ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డే ఆఫర్ ఒక్కరోజు మాత్రమే ఉండగా ఈ అమెజాన్‌డాట్‌ఇన్ ఆఫర్లు ఆరు రోజులుంటాయి. తమ పోటీ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ల కంటే ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తామని అమెజాన్‌డాట్‌ఇన్ పేర్కొంది. విష్‌లిస్ట్, మరిన్ని మల్టిపుల్ లిస్ట్‌ల వంటి యూజర్-ఫ్రెండ్లీ ఫీచర్లు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
ఆరు రోజుల పాటు ఈ దివాళి ధమాకా డీల్స్ ఉంటాయని అమెజాన్ ప్రకటించడంతో వివిధ వస్తువుల నిల్వలను నిర్వహించడం అమెజాన్‌కు అతి పెద్ద పరీక్ష కానున్నదని నిపుణులంటున్నారు. డిమాండ్ బాగా ఉండటంతో ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డే ఆఫర్ విజయవంతం కాలేదు.డీల్స్ ఇలా కనిపించి అలా మాయమవడంతో ఫ్లిప్‌కార్ట్‌పై ఆన్‌లైన్‌లో జోకులు బాగా పేలాయి. మరో ఆన్‌లైన్ సంస్థ స్నాప్‌డీల్ కూడా భారీ డిస్కౌంట్లనిస్తున్నామని ఆదేరోజు ప్రకటించింది. శుక్రవారం కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లుంటాయని స్నాప్‌డీల్ పత్రికల్లో ప్రకటనలు గుప్పించింది.