కరోనా వైరస్ ఉధృతి ఆగనప్పటికీ చైనాసహా అమెరికావరకూ ఆర్థిక వ్యవస్థలు తిరిగి పురోగతి బాట పట్టనున్న అంచనాలు సోమవారం యూరోపియన్, యూఎస్ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 1.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇక యూఎస్ ఇండెక్సులలో డోజోన్స్ 460 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 26,287 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 50 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 3,180 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మరింత అధికంగా 226 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 10,434 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎస్‌అండ్‌పీ వరుసగా ఐదో రోజు లాభపడింది. ఇంతక్రితం గతేడాది డిసెంబర్ 17న మాత్రమే ఎస్‌అండ్‌పీ ఈ ఫీట్ సాధించింది. ఇండిపెండెన్స్ డే(4న) సందర్భంగా శుక్రవారం(3న) యూఎస్ మార్కెట్లు పనిచేయని సంగతి తెలిసిందే. కాగా.. గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం పుంజుకోగా.. ఎస్‌అండ్‌పీ 4 శాతం ఎగసింది. నాస్‌డాక్ అయితే 4.6 శాతం జంప్‌చేసింది. ఈ ర్యాలీ సోమవారం సైతం కొనసాగడం మార్కెట్లలో నెలకొన్న బుల్లిష్ ధోరణిని సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
బ్లూచిప్స్ దూకుడు
అమ్మకాలు ఊపందుకుంటున్న అంచనాలతో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి 3057 డాలర్లకు చేరింది. వెరసి తొలిసారి 3,000 డాలర్ల మార్క్‌ను తొలిసారి అధిగమించింది. దీంతో అమెజాన్ మార్కెట్ క్యాప్(విలువ) 1.5 లక్షల కోట్ల డాలర్లను తాకింది. జూన్‌లో కార్ల విక్రయాలు పెరగడంతో వరుసగా ఐదో రోజు ఆటో రంగ దిగ్గజం టెస్లా ఇంక్ దూకుడు చూపింది. ఏకంగా 13.5 శాతం దూసుకెళ్లింది. 1372 డాలర్ల సమీపంలో ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! ఇతర కౌంటర్లలో బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 5 శాతం, బోయింగ్ 4 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 6 శాతం, వాల్‌గ్రీన్ బూట్స్ 2.8 శాతం, బెర్క్‌షైర్ హాథవే 2.4 శాతం చొప్పున ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment