
ముంబై : ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీది ఆన్‌లైన్‌లోనే కొనడం అలవాటైంది. అయితే ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది ఎలాక్ట్రానిక్, కాస్మోటిక్ ఉత్పత్తులనే కొనడానికి మొగ్గు చూపుతారు. బట్టలు, చెప్పులు వంటివి కొనాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. కారణం... సరైన సైజు దొరకదని, రంగు వంటి వాటి విషయాల్లోను తేడాలు ఉంటాయని. అయితే ఇక మీదట ఈ ఇబ్బందులు ఉండవంటోంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ఈ ఇబ్బందులకు పరిష్కారాన్ని కనుక్కోవడం కోసం అమెజాన్ ఒక నూతన సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. త్వరలో అమెజాన్ త్రీడీ బాడీ స్కానింగ్ ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది.
అమెజాన్ రూపొందిస్తున్న ఈ నూతన టెక్నాలజీ ద్వారా వినియోగదారుల శరీరాన్ని త్రీడీ స్కానింగ్ చేసి వారికి సరిగ్గా సరిపోయే దుస్తులు, చెప్పులు వంటి వాటిని సూచిస్తుంది. దీనిని పరీక్షించడం కోసం స్వచ్చంద సహాయకులను ఆహ్వానించింది. వీరంతా నెలకు రెండు సార్లు న్యూయార్క్‌లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరిని ఇలా స్కాన్ చేయడం ద్వారా తాము రూపొందిచబోయే నూతన సాంకేతికతకు మానవ శరీరంలో జరిగే మార్పులును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇలా వచ్చే సహాయకులకు 250 డాలర్ల విలువ చేసే గిఫ్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక ఆన్‌లైన్లోనే వినియోగదారులు తమకు నప్పే దుస్తులు, చెప్పులను ఎంచుకోవచ్చని, ఫలితంగా రిటర్న్ వచ్చే ఆర్డర్‌ల సంఖ్య బాగా తగ్గుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment