బిల్‌గేట్స్‌ను బీట్‌చేసిన అమెజాన్ ఫౌండర్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టేశారు. ప్రపంచపు అత్యధిక ధనవంతుడిగా జెఫ్ బెజోస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్ స్టాక్ ధరలు గురువారం మార్కెట్ ప్రారంభంలో 1.6 శాతం మేర పైకి జంప్ చేయడంతో జెఫ్ బెజోస్‌కు అదనంగా 1.4 బిలియన్ డాలర్ల అదృష్టం కలిసి వచ్చింది. దీంతో ఆయన సంపద 90 బిలియన్ డాలర్లను మించిపోయిందని బ్లూమ్‌బర్గ్, ఫోర్బ్స్ రిపోర్టు చేశాయి. 2013 మే నుంచి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ల ఇండెక్స్‌లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్సే అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు. కానీ తొలిసారి జెఫ్ బెజోస్ ఆయన్ను అధిగమించారు.
బుధవారం మార్కెట్ ముగింపుకు బిల్‌గేట్స్ సంపద 90 బిలియన్ డాలర్లుగా ఉంది. బెజోస్ ఆయనకు దగ్గరగా 89 బిలియన్ డాలర్లకు వెళ్లారు. గురువారం మార్కెట్ ప్రారంభంలోనే అమెజాన్ షేర్లు శరవేగంగా దూసుకెళ్లడంతో, బిల్‌గేట్స్ సంపదకు మించి, బెజోస్ సంపద 90 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.
అమెజాన్.కామ్‌లో బెజోస్‌కు 80 మిలయన్ షేర్లున్నాయి. ఇటీవలే తమ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ను ఆవిష్కరించారు. 2017 జూన్‌లో గ్రోసరీ చైన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ రిటైలర్‌ను కూడా అమెజాన్ దక్కించుకుంది. దీంతో అమెజాన్ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. గత 30 ఏళ్లుగా కూడా బెజోస్ ప్రపంచపు ధనికవంతుల్లో ఆరోవ్యక్తిగా నిలిచేవారు.