సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే విపత్కాలంలో ధైర్యంగా సేవలందిస్తున్న తమ ఉద్యోగులను ఆర్‌ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసించారు. దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంటే కోవిడ్-19పై ఆర్‌ఐఎల్ సమరంలో గ్రూపు సంస్థల ఉద్యోగులు యోధులా నిలిచారని బిలియనీర్ ముఖేష్ ప్రస్తుతించారు. మహమ్మారి కోరల్లో దేశం చిక్కుకున్న ఈ విపత్తు వేళ ఉద్యోగులంతా అంకితభావంతో సేవలందిస్తున్నారని రెండు లక్షలకు పైగా ఆర్‌ఐఎల్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో 130 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా రిలయన్స్ జియో 40 కోట్ల మందికి నిరంతర వాయిస్ కాల్స్, మొబైల్‌పై ఇంటర్‌నెట్ సేవలను అందించిందని, రిలయన్స్ రిటైల్ ద్వారా లక్షలాది మందికి నిత్యావసరాలు, ఆహారం సరఫరా సమకూరిందని చెప్పారు.
కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు టెస్టింగ్ సామర్థ్యాల పెంపునకు రిలయన్స్ లైఫ్‌సైన్సెస్ సన్నాహాలు చేస్తోందని గుర్తుచేశారు. హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి ముంబైలో కేవలం పదిరోజుల్లోనే వంద పడకల కరోనావైరస్ చికిత్సా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. కంపెనీ రిఫైనరీలు ఇంధన అవసరాలను తీర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇక సిబ్బంది తమ ఆలోచనలు పంచుకునేందుకు మైవాయిస్ వేదికను లాంఛ్ చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించి మనం సురక్షితంగా, ఆరోగ్యకరంగా ముందుకెళతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment