
న్యూఢిల్లీ: చైనా నుంచి వచ్చే 34 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అమెరికా అదనపు టారిఫ్ లు విధించడం అన్నది పలు భారత ఉత్పత్తులు మరింత పోటీగా మారేందుకు తోడ్పడుతుందని సీఐఐ పేర్కొంది. మెషినరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, వాహనాలు, రవాణా, కెమికల్స్, ప్లాస్టిక్స్, రబ్బర్ ఉత్పత్తుల విషయమై అమెరికా మార్కెట్‌పై దృష్టి సారించాలని సూచించింది. ‘‘చైనా–అమెరికా ఒకరికొకరు మరో దేశ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించుకున్న దృష్ట్యా, ఆ రెండు దేశాలకు ఎన్నో ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్ దృష్టి సారించొచ్చు’’ అని సీఐఐ పేర్కొంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ప్రముఖ ఉత్పత్తులు పంపులు, మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు, ఎలక్ట్రోడయాగ్నస్టిక్ ఉపకరణాలు, 1500 – 3000సీసీ సామర్థ్యం కలిగిన ప్యాసింజర్ వాహనాలు, వాల్వ్ బాడీలు, ట్యాప్ భాగాలు టారిఫ్‌లు విధించిన జాబితాలో ఉన్నాయని సీఐఐ తెలిపింది.
2017లో మన దేశం నుంచి ఈ ఉత్పత్తుల ఎగుమతులు 50 మిలియన్ డాలర్ల మేర ఉన్నాయని, గట్టి ప్రయత్నాల ద్వారా వీటిని పెంచుకోవచ్చని సూచిం చింది. ప్రస్తుతం మన దేశం నుంచి అమెరికాకు జరుగుతున్న ఎగుమతుల ఆధారంగా, రక్షణ, ఎయిరో స్పేస్ విడిభాగాలు, వాహనాలు, వాహన విడిభాగాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులను పెంచుకునేందుకు అధిక అవకాశాలున్నాయని పేర్కొంది. టెక్స్‌టైల్స్, పాదరక్షలు, ఆటబొమ్మలు, గేమ్స్, సెల్‌ఫోన్ల తయారీ భారత్ నుంచి పోటీపడతగ్గ పరిశ్రమలని, వీటికి ప్రోత్సాహం అవసరమని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment