ముంబై: కేంద్రం అదనపు మూలధన కేటాయింపులు బ్యాకింగ్‌కు మంచిదేకానీ మొండిబకాయిలతోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని రేటింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 2.11 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.88 వేల కోట్ల అదనపు మూలధనాన్ని బ్యాంకింగ్‌కు అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో... రెండు ప్రధాన రేటింగ్ సంస్థల విశ్లేషణల్లో ప్రధాన అంశాలు చూస్తే....
ఇబ్బందులు తగ్గుతాయ్: ఫిచ్
ప్రభుత్వ తాజామూలధన కల్పన మూలధనానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇబ్బందులు తగ్గడానికి దోహదపడుతుంది. నిర్వహణకు సంబంధించి రేటింగ్స్ పడిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. అయితే మొండిబకాయిలు, అధిక రుణ వ్యయాలు సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ పనితీరుకు కొంత ఇబ్బంది కలిగించే అంశాలే. బలహీన రుణ నాణ్యత, ఆదాయాలపై బ్యాంకింగ్ తక్షణం దృష్టి సారించాలి. వ్యాపార వ్యూహాలను పటిష్టపరచుకోవాలి. చిన్న తరహా పరిశ్రమలకు రుణ సాయం పెరగాలి.
బ్యాంకులకు క్రెడిట్ పాజిటివ్: ఎస్‌అండ్‌పీ
ప్రభుత్వ తాజా ప్రకటన బ్యాంకులకు క్రెడిట్ పాజిటివ్. అయితే ఇదొక్కటే సరిపోదు. మొండిబకాయిల పరిష్కారానికి పెద్దపీట వేయడంతోపాటు బ్యాంకింగ్ ప్రధానంగా పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. రిస్క్ నిర్వహణా విధానాలకు పదునుపెట్టాలి. లాభదాయకత దిశగా బ్యాంకులు విభిన్న వ్యాపార వ్యూహాలను అలవరచుకోవాలి. బ్యాంకులు క్రమంగా బ్యాంకింగ్‌యేతర వ్యాపారాలను మానుకుని, తమ ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారించాలి.
Comments
Please login to add a commentAdd a comment