rating agencies
-
సంకీర్ణ ప్రభుత్వం.. తగ్గనున్న సంస్కరణల వేగం..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి. 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి సంబంధించిన ప్రభావాలపై ఫిచ్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్స్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్.. పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది. ‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే 2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్‌తో పోలిస్తే భారత్ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.ల్యాండ్, లేబర్ సంస్కరణల అమలు కష్టమే‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్ గ్రూప్‌లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్‌పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్ (కంట్రీ రిస్క్) డారెన్ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
రుణ నాణ్యతపై అదానీ గ్రూప్ ఎఫెక్ట్ ఉండదు: ఫిచ్, మూడీస్
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో రేటింగ్ దిగ్గజాలు కీలక వ్యాఖ్యలు చేశాయి అదానీ గ్రూపునకు బ్యాంకుల రుణాలు వాటి ‘రుణ నాణ్యతపై’ ప్రభావితం చూపే భారీ స్థాయిలో లేవని గ్లోబల్ రేటింగ్ దిగ్గజాలు- ఫిచ్, మూడీస్ పేర్కొన్నాయి. అవసరమైతే వాటికి ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు అందే అవకాశం ఉందని కూడా విశ్లేషించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఎక్కువ రుణాలు ఇచ్చినప్పటికీ, అవి ఆయా బ్యాంకుల మొత్తం రుణాలలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది. ‘‘భారతీయ బ్యాంకుల కార్పొరేట్ రుణాల మొత్తం నాణ్యత స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలలో చిన్న స్థాయి కార్పొరేట్లు నష్టపోయాయి. ఇది కొన్ని బ్యాంకుల కార్పొరేట్ రుణ పుస్తకాలలో భారీ వృద్ధిని నిలువరించింది’’ అని మూడీస్ విశ్లేషించింది. ఏదైనా అవసరమైతే అసాధారణ రీతిలో బ్యాంకింగ్‌కు ప్రభుత్వ మూలధన మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్‌కు దేశ దిగ్గజ బ్యాంక్ రుణాలు రూ.27,000 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా రూ.7,000 కోట్లు. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ మొత్తం రుణాల్లో అదానీ గ్రూప్ రుణ వాటా 0.94 శాతం. దేశ మౌలిక రంగం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్‌కు కష్టాలు కొనసాగితే, మధ్య కాలికంగా అది దేశ ఆర్థిక వృద్ధిపై నామమాత్రపు ప్రభావమే చూపుతుందని ఫిచ్ అంచనావేస్తోంది. భారత్ ఆర్థిక వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని కూడా పేర్కొంది. -
‘ఫిచ్ రేటింగ్స్’: దేశ జీడీపీ భారీగా తగ్గింపు, కరోనా వల్లే
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతానికి తగ్గిస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్ రేటింగ్స్’ తన నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా రెండో విడత ఎక్కువ కాలం పాటు ఉండడాన్ని తన అంచనాల తగ్గింపునకు దారితీసిన అంశంగా ఫిచ్ తెలిపింది. భారత్ జీడీపీ 10 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) వృద్ధిని నమోదు చేయవచ్చని ఈ ఏడాది జూన్‌లో ఫిచ్ అంచనా వేయడం గమనార్హం. అప్పుడు కూడా అంతక్రితం అంచనాలను గణనీయంగా తగ్గించేసింది. అంతకుముందు వేసిన అంచనా 12.8 శాతంగా ఉంది. కరోనా దెబ్బకు 2020–21లో దేశ జీడీపీ మైనస్ 7.3 శాతానికి పడిపోవడం తెలిసిందే. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లోనూ వృద్ధి 4 శాతానికి పరిమితం అయింది. ‘‘మా అభిప్రాయం మేరకు.. కరోనా రెండో విడత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే.. నిదానించేలా చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఈ ఏడాది జూన్‌లో వేసిన 8.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నాం’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ద్రవ్యలోటు భారీగా.. ద్రవ్యలోటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ భావిస్తోంది. జీడీపీలో 7.2 శాతంగా (పెట్టుబడుల ఉపసంహరణను మినహాయించి చూస్తే) ఉండొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 28న ఒక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. దీని ప్రభావం జీడీపీలో 2.7 శాతం మేర ఉంటుందని ఫిచ్ అంచనా. ‘‘అయినప్పటికీ ఆదాయం మంచిగా పురోగమిస్తే కనుక అధిక వ్యయాల భారాన్ని అధిగమించొచ్చు. అప్పుడు ద్రవ్యలోటు కట్టడి సాధ్యపడుతుంది. ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమిత లక్ష్యం (2–6) స్థాయిలోనే ఉండొచ్చు. అయితే ఇది మోస్తరు స్థాయికి చేరుతుంది. దీంతో ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అలా అయితే కష్టం.. ప్రభుత్వం కనుక ద్రవ్యలోటును తగినంత స్థాయిలో కట్టడి చేయలేకపోతే అప్పుడు రుణ భారం/జీడీపీ రేషియో మరింత దిగజారుతుందని.. అది జీడీపీ వృద్ధిని బలహీనం చేయవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రభుత్వం సాధారణ రుణ భారాన్ని బీబీబీ స్థాయికి తగ్గించేందుకు.. విశ్వసనీయమైన మధ్యకాలిక ద్రవ్యలోటు విధానాన్ని అమలు చేయడం సానుకూలంగా పేర్కొంది. అదే విధంగా స్థిరమైన అధికస్థాయి పెట్టుబడులు, గరిష్ట వృద్ధి రేటును మధ్యకాలానికి.. ఎటువంటి స్థూల ఆర్థిక అసమానతలు లేకుండా నమోదు చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం కూడా సానుకూలిస్తుందని ఫిచ్ అంచనా వేసింది. ఇతర అంచనాలు.. ఆర్బీఐ సైతం ఈ ఏడాది జూలై నాటి సమీక్షలో దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ 9.5 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేయగా.. మూడిస్ 9.3 శాతంగా పేర్కొంది. ప్రపంచబ్యాంకు కూడా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి అంచనాలను సవరించింది. వృద్ధి 9.1%: ఫిక్కీ 2021–22లో దేశ జీడీపీ 9.1% వృద్ధిని సాధిం చొచ్చని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే తెలిపింది. కరోనా రెండో విడత నుంచి ఆర్థిక వ్యవస్థ మంచిగా పుంజుకుంటుండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. అయితే దీపావళి సమయంలో ప్రజల రాకపోకలు ఎక్కువ అవ్వడం వల్ల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఫిక్కీ సర్వేలో వృద్ధి 9 శాతంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. నైరుతి సీజన్ చివర్లో వర్షాలు మంచిగా పుం జుకోవడం, ఖరీఫ్‌లో సాగు పెరగడం వృద్ధి అంచనాలకు మద్దతునిస్తాయని ఫిక్కీ తెలిపింది. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, పండుగల సీజన్లో విక్రయాలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై స్పష్టతనిస్తాయని పేర్కొంది. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
అదనపు మూలధనం మంచిదేకానీ..
ముంబై: కేంద్రం అదనపు మూలధన కేటాయింపులు బ్యాకింగ్‌కు మంచిదేకానీ మొండిబకాయిలతోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని రేటింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 2.11 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.88 వేల కోట్ల అదనపు మూలధనాన్ని బ్యాంకింగ్‌కు అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో... రెండు ప్రధాన రేటింగ్ సంస్థల విశ్లేషణల్లో ప్రధాన అంశాలు చూస్తే.... ఇబ్బందులు తగ్గుతాయ్: ఫిచ్ ప్రభుత్వ తాజామూలధన కల్పన మూలధనానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇబ్బందులు తగ్గడానికి దోహదపడుతుంది. నిర్వహణకు సంబంధించి రేటింగ్స్ పడిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. అయితే మొండిబకాయిలు, అధిక రుణ వ్యయాలు సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ పనితీరుకు కొంత ఇబ్బంది కలిగించే అంశాలే. బలహీన రుణ నాణ్యత, ఆదాయాలపై బ్యాంకింగ్ తక్షణం దృష్టి సారించాలి. వ్యాపార వ్యూహాలను పటిష్టపరచుకోవాలి. చిన్న తరహా పరిశ్రమలకు రుణ సాయం పెరగాలి. బ్యాంకులకు క్రెడిట్ పాజిటివ్: ఎస్అండ్పీ ప్రభుత్వ తాజా ప్రకటన బ్యాంకులకు క్రెడిట్ పాజిటివ్. అయితే ఇదొక్కటే సరిపోదు. మొండిబకాయిల పరిష్కారానికి పెద్దపీట వేయడంతోపాటు బ్యాంకింగ్ ప్రధానంగా పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. రిస్క్ నిర్వహణా విధానాలకు పదునుపెట్టాలి. లాభదాయకత దిశగా బ్యాంకులు విభిన్న వ్యాపార వ్యూహాలను అలవరచుకోవాలి. బ్యాంకులు క్రమంగా బ్యాంకింగ్యేతర వ్యాపారాలను మానుకుని, తమ ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారించాలి. -
రేటింగ్ ఏజెన్సీలపై అరవింద్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ ఏజెన్సీల పేరుతో ఆడుకుంటున్నాయనీ మండిపడ్డారు. వాటివి పూర్ స్టాండర్డ్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలలో భారత్‌లో బలమైన ఆర్థిక పనితీరు ఉన్నప్పటికీ భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చడం లేదని ఆయన విమర్శించారు. వికెఆర్వి మెమోరియల్ లెక్చర్ సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంవత్సరాల్లో ఆర్ధిక ఫండమెంటల్స్ (ద్రవ్యోల్బణం, పెరుగుదల, ప్రస్తుత ఖాతా పనితీరు)లో స్పష్టమైన మెరుగుదలలు ఉన్నప్పటికీ, రేటింగ్ ఏజెన్సీలు భారత్‌కు బీబీబీ రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనప్పటికీ, దానికి రేటింగ్‌ను ఏఏగా అప్ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. మరో మాటలో చెప్పాలంటే రేటింగ్ ఏజెన్సీలు చైనా, భారత్ రేటింగ్ విషయంలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇలాంటి రేటింగ్లను విశ్లేషకులందరినీ మనం సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. దేశీయంగా నిపుణుల విశ్లేషణలకు, అధికారిక నిర్ణయాలకు సారూప్యం ఉంటోందన్నారు. విధాన నిర్ణయాల ముందు, నిపుణ విశ్లేషణ తరచుగా భిన్నంగా ఉన్నా, నిర్ణయాలు తీసుకున్నతర్వాత విశ్లేషణ ధ్వని మరియు స్వరం మారుతోందన్నారు. అధికారిక నిర్ణయాన్ని హేతుబద్ధంగా విశ్లేషిస్తున్నారని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అనేక ఆర్థిక సంక్షోభ సమయాల్లో ముందస్తు హెచ్చరికలు జారీచేయడంలో రేటింగ్ ఏజెన్సీలు వరుసగా విఫలమవుతూ వచ్చాయంటూ దాడి చేశారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన తనఖా-రుణాల సెక్యూరిటీలకు ఏఏఏ రేటింగ్ ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోందన్నారు. అధికారంలోకివచ్చిన 2014నుంచి విధానాలను క్రమబద్దీకరించడానికి , ద్రవ్యోల్బణ అదుపునకు చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
'మేకిన్ ఇండియా నినాదం అద్భుతం'
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపు ఎవరికి ఎలా అనిపించినా, అంతర్జాతీయ విశ్లేషకులకు మాత్రం బాగా నచ్చింది. ఆయన ఎక్కడికెళ్లినా మేకిన్ ఇండియా అంటూ దాని ప్రాశస్త్యం గురించి చెబుతున్నారు. అది ఎందుకు అవసరమో కూడా వివరిస్తున్నారు. ఇటీవల జపాన్ దేశంలో పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామిక వేత్తలను కూడా భారతదేశానికి వచ్చి, ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పాలని, దానివల్ల వాళ్లకు తయారీఖర్చు తగ్గుతుందని, లాభాలు పెరుగుతాయని వివరించారు. అప్పుడే వాళ్లకు కూడా 'కమాన్.. మేకిన్ ఇండియా' అని చెప్పారు. వెంటనే అక్కడ సదస్సులో ఒక్కసారిగా అభినందనలు వెల్లువెత్తాయి. నరేంద్రమోడీ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అంతర్జాతీయ నిపుణులు శ్లాఘిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఎనలిటిక్స్' కూడా నరేంద్రమోడీ నినాదాన్ని అభినందించింది. సాధారణంగా భారత రాజకీయ నాయకులు ఇలాంటి చాలా నినాదాలు ఇచ్చి ఊరుకుంటారని, కానీ నరేంద్ర మోడీ విషయంలో మాత్రం అది అమలయ్యేలాగే కనిపిస్తోందని మూడీస్ ఎనలిటిక్స్ సంస్థలో ఆర్థికవేత్త అయిన గ్లెన్ లెవిన్ చెప్పారు.