సాక్షి,ముంబై: అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో రేటింగ్ దిగ్గజాలు కీలక వ్యాఖ్యలు చేశాయి అదానీ గ్రూపునకు బ్యాంకుల రుణాలు వాటి ‘రుణ నాణ్యతపై’ ప్రభావితం చూపే భారీ స్థాయిలో లేవని గ్లోబల్ రేటింగ్ దిగ్గజాలు- ఫిచ్, మూడీస్ పేర్కొన్నాయి. అవసరమైతే వాటికి ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు అందే అవకాశం ఉందని కూడా విశ్లేషించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఎక్కువ రుణాలు ఇచ్చినప్పటికీ, అవి ఆయా బ్యాంకుల మొత్తం రుణాలలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది. ‘‘భారతీయ బ్యాంకుల కార్పొరేట్ రుణాల మొత్తం నాణ్యత స్థిరంగా ఉంది.
అయితే గత కొన్ని సంవత్సరాలలో చిన్న స్థాయి కార్పొరేట్‌లు నష్టపోయాయి. ఇది కొన్ని బ్యాంకుల కార్పొరేట్ రుణ పుస్తకాలలో భారీ వృద్ధిని నిలువరించింది’’ అని మూడీస్ విశ్లేషించింది. ఏదైనా అవసరమైతే అసాధారణ రీతిలో బ్యాంకింగ్‌కు ప్రభుత్వ మూలధన మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది.
అదానీ గ్రూప్‌కు దేశ దిగ్గజ బ్యాంక్ రుణాలు రూ.27,000 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా రూ.7,000 కోట్లు. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ మొత్తం రుణాల్లో అదానీ గ్రూప్ రుణ వాటా 0.94 శాతం. దేశ మౌలిక రంగం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్‌కు కష్టాలు కొనసాగితే, మధ్య కాలికంగా అది దేశ ఆర్థిక వృద్ధిపై నామమాత్రపు ప్రభావమే చూపుతుందని ఫిచ్ అంచనావేస్తోంది. భారత్ ఆర్థిక వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని కూడా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment