'మేకిన్ ఇండియా నినాదం అద్భుతం'
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపు ఎవరికి ఎలా అనిపించినా, అంతర్జాతీయ విశ్లేషకులకు మాత్రం బాగా నచ్చింది. ఆయన ఎక్కడికెళ్లినా మేకిన్ ఇండియా అంటూ దాని ప్రాశస్త్యం గురించి చెబుతున్నారు. అది ఎందుకు అవసరమో కూడా వివరిస్తున్నారు. ఇటీవల జపాన్ దేశంలో పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామిక వేత్తలను కూడా భారతదేశానికి వచ్చి, ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పాలని, దానివల్ల వాళ్లకు తయారీఖర్చు తగ్గుతుందని, లాభాలు పెరుగుతాయని వివరించారు. అప్పుడే వాళ్లకు కూడా 'కమాన్.. మేకిన్ ఇండియా' అని చెప్పారు. వెంటనే అక్కడ సదస్సులో ఒక్కసారిగా అభినందనలు వెల్లువెత్తాయి.
నరేంద్రమోడీ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అంతర్జాతీయ నిపుణులు శ్లాఘిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఎనలిటిక్స్' కూడా నరేంద్రమోడీ నినాదాన్ని అభినందించింది. సాధారణంగా భారత రాజకీయ నాయకులు ఇలాంటి చాలా నినాదాలు ఇచ్చి ఊరుకుంటారని, కానీ నరేంద్ర మోడీ విషయంలో మాత్రం అది అమలయ్యేలాగే కనిపిస్తోందని మూడీస్ ఎనలిటిక్స్ సంస్థలో ఆర్థికవేత్త అయిన గ్లెన్ లెవిన్ చెప్పారు.