సాక్షి, ముంబై: పసిడి 10 గ్రాముల ధర ఈ సంవత్సరాంతానికి దేశంలో రూ.42,000ను తాకుతుందని కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని వారి విశ్లేషణ.
అంతర్జాతీయంగా 1,650 డాలర్లకు..!
‘‘మధ్య ప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీనితో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,650 డాలర్లకు చేరవచ్చు. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ఈ ధర 10 గ్రాములకు ఏకంగా రూ.42,000కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని కాంట్రెంజ్ రిసెర్చ్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ జ్ఞాన్‌శేఖర్ త్యాగరాజన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకూ పసిడి ధర పెరుగుదల ధోరణినే కనబరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈక్విటీల్లో సంవత్సరాంత డెరివేటివ్ పొజిషన్ల స్క్వేరాఫ్ అవకాశాలు కూడా పసిడి ధర పెరుగుదలకు దోహదపడుతుందని ఆయన విశ్లేషించారు. పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్ పసిడిని చూస్తాడనడానికి పలు కారణాలు కనబడుతున్నాయని అన్నారు. ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం ట్రేడింగ్ చివరకు రూ.38,293 వద్ద ముగిసింది. ఇక నైమెక్స్‌లో ఔన్స్ ధర సోమవారం ఈ వార్తరాసే రాత్రి 8 గంటల సమయానికి 1,492 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం దేశీయ మార్కెట్లకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment