
సెక్యురిటీ రీసెర్చర్లు మరో మాల్‌వేర్ భూతాన్ని కనుగొన్నారు. ఈ మాల్‌వేర్ యూజర్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై పూర్తి ఆధిపత్యం సంపాదించి, సమాచారాన్ని దొంగలిస్తుందని రష్యాకు చెందిన కాస్పెర్‌స్కై ల్యాబ్ రీసెర్చర్లు వెల్లడించారు. దీంతో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న వాట్సాప్ మెసేజ్‌లు కూడా ఈ మాల్‌వేర్ చోరి చేస్తుందని కాస్పెర్‌స్కై ల్యాబ్ హెచ్చరించింది. ఈ మాల్‌వేర్‌ను స్కైగోఫ్రీగా రీసెర్చర్లు పేర్కొన్నారు. 2014లో తొలుత దీన్ని రూపొందించారని, అప్పటి నుంచి ఇది అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిసింది. అంతకముందు ఎన్నడూ మనం చూడని విధంగా ఓ ప్రత్యేక ప్రాంతంలోకి టార్గెట్ ఫోన్ ప్రవేశించగానే, వ్యక్తుల సంభాషణను, చుట్టుపక్కల ఆడియోలను ఆటోమేటిక్ రికార్డు చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు.
పిక్చర్లను, వీడియోలను తీసే సామర్థ్యాన్ని కూడా ఈ స్కైగోఫ్రీ కలిగి ఉందని, డివైజ్ మెమరీలో స్టోర్ అయి ఉన్న కాల్ రికార్డులను సీజ్ చేయడం, ఎస్‌ఎంఎస్‌లు, జియోలొకేషన్, కాలెండర్ ఈవెంట్లు, బిజినెస్‌లకు సంబంధించిన సమాచారం తన ఆధీనంలోకి తీసుకెళ్లడం వంటి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మాల్‌వేర్ బారిన పడిన బాధితులు ఎక్కువగా ఇటలీలో ఉన్నారు. అదేవిధంగా ఈ మాల్‌వేర్ టూల్‌ను సృష్టించిన వారు కూడా ఇటాలియన్లే అని తెలిసింది. అటాకర్ల ఆధీనంలో ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌లకు కూడా ఈ ప్రభావిత డివైజ్‌లు కనెక్ట్ అవుతుంటాయని రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment