స్టార్టప్స్‌కు ఊరట..! | Angel Tax: The Last Leg Of The Relay? | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌కు ఊరట..!

Published Wed, Feb 20 2019 2:01 AM | Last Updated on Wed, Feb 20 2019 8:15 AM

 Angel Tax: The Last Leg Of The Relay? - Sakshi

న్యూఢిల్లీ: ఏంజెల్‌ ట్యాక్స్‌ నోటీసులతో ఆందోళన చెందుతున్న స్టార్టప్‌ సంస్థలకు ఊరటనిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. స్టార్టప్‌ సంస్థల నిర్వచనాన్ని మార్చడంతో పాటు నిబంధనలను సడలించింది. ఇకపై రూ. 25 కోట్ల దాకా పెట్టుబడులపై పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపులు వర్తింపచేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రమోటర్లు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేసే పెట్టుబడులకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. ‘అర్హత కలిగిన లిస్టెడ్‌ కంపెనీలు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ చేసే పెట్టుబడులు కూడా ఈ పరిమితి పరిధిలోకి రావు. దీంతో పెట్టుబడులు రూ. 25 కోట్లకు మించినప్పటికీ స్టార్టప్‌ సంస్థలు పన్నుపరమైన ప్రయోజనాలు పొందవచ్చు‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు.

ఇప్పటిదాకా ఏంజెల్‌ ఇన్వెస్టర్లు సహా ఇతరత్రా సమీకరించిన మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల దాకా మాత్రమే ఈ పరిమితి ఉండేది. పన్ను రాయితీల ప్రయోజనాలు కల్పించే క్రమంలో స్టార్టప్‌ సంస్థ నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చింది. టర్నోవరు పరిమితి రూ. 25 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచింది. ఏర్పాటైనప్పట్నుంచీ ఏ ఆర్థిక సంవత్సరంలోనూ టర్నోవరు రూ. 100 కోట్లు దాటని సంస్థను స్టార్టప్‌గా పరిగణిస్తారు. పన్నుపరమైన ప్రయోజనాలు పొందేందుకు ఉద్దేశించిన కాల వ్యవధిని 7 సంవత్సరాల నుంచి పదేళ్లకు పెంచారు. పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను 2021 మార్చి 31 లోగా సమీక్షించే అవకాశం ఉంది. ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇప్పటికే జారీ చేసిన ట్యాక్స్‌ నోటీసులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు సీబీడీటీ సూచించింది.  

పెద్ద స్టార్టప్స్‌కూ ప్రయోజనం.. 
తాజాగా సడలించిన నిబంధనలతో పెద్ద స్టార్టప్‌లకు కూడా ప్రయోజనం చేకూరగలదని లక్ష్మీకుమరన్‌ అండ్‌ శ్రీధరన్‌ అటార్నీస్‌ సంస్థ పార్ట్‌నర్‌ ఎస్‌ వాసుదేవన్‌ పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పైబడి టర్నోవరు ఉండి, షేర్ల కేటాయింపు ద్వారా సమీకరించిన ప్రీమియం పెట్టుబడులపై ట్యాక్స్‌లు కట్టాల్సిన స్టార్టప్‌లకు కూడా ఊరట లభిస్తుందని వివరించారు. ఇప్పటిదాకా రూ. 5 కోట్ల కన్నా తక్కువ మొత్తం ఇన్వెస్ట్‌ చేసే ఏంజెల్‌ ఇన్వెస్టర్లకూ పన్నుపోటు ఉంటోందని, తాజాగా పెట్టుబడుల పరిమితిని రూ. 25 కోట్లకు పెంచడం ద్వారా ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మించి ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని డీపీఐఐటీ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ చెప్పారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన స్టార్టప్స్‌ 16,000 పైచిలుకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  

సవరించిన నిబంధనల ప్రకారం..  
రూ. 100 కోట్ల నికర విలువ లేదా టర్నోవరు రూ. 250 కోట్ల పైచిలుకు ఉన్న లిస్టెడ్‌ కంపెనీలు.. అర్హత కలిగిన స్టార్టప్స్‌లో చేసే పెట్టుబడులపై పన్నుపరమైన మినహాయింపులు పొందవచ్చు. ఇది రూ. 25 కోట్ల పెట్టుబడుల పరిమితికి అదనంగా ఉంటుంది. ఇక, అర్హత కలిగిన స్టార్టప్‌లలో ప్రవాస భారతీయులు, ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌ (కేటగిరి1) మొదలైనవి చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కూడా మినహాయింపులు లభిస్తాయి. ఇవి కూడా రూ. 25 కోట్ల పరిమితికి అదనంగా ఉంటుంది.   ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా ఉన్న స్టార్టప్‌ సంస్థ డీపీఐఐటీ గుర్తింపు పొంది ఉండి, నిర్దిష్ట అసెట్స్‌లో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపులు పొందవచ్చు. స్థిరాస్తి, రూ. 10 లక్షలు దాటిన రవాణా వాహనాల కొనుగోలు, వ్యాపార అవసరార్థం తప్పితే ఇతరత్రా సంస్థలకు రుణాలివ్వడం, షేర్ల కొనుగోలు మొదలైన వాటికి ఈ మినహాయింపులు వర్తించవు. అయితే, ఆయా రంగాల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు మినహాయింపు ఉంటుంది.   స్టార్టప్‌ సంస్థలు ఈ మినహాయింపులు పొందాలంటే సమీకరించిన నిధుల వినియోగం గురించి డీపీఐఐటీకి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పిస్తే సరిపోతుంది. దీన్ని ఆ తర్వాత కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు డిపార్ట్‌మెంటు పంపుతుంది.

ఏంజెల్‌ పెట్టుబడులకు మార్గం సుగమం.. 
నిబంధనలను సడలించడంపై పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. తాజా పరిణామంతో స్టార్టప్‌ సంస్థల్లో ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు మళ్లీ పుంజుకోగలవని ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ (ఐఏఎన్‌) సహ వ్యవస్థాపకురాలు పద్మజా రూపారెల్‌ చెప్పారు. స్టార్టప్‌లకు పెద్ద అడ్డంకి తొలిగిపోయినట్లవుతుందని లోకల్‌సర్కిల్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు సచిన్‌ తపాడియా చెప్పారు. ‘ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు మరింత ఊతమిస్తుంది. స్టార్టప్‌ల సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉన్న భారత్‌.. త్వరలోనే అగ్రస్థానానికి చేరేందుకు ఇది దోహదపడుతుంది‘ అని టీఐఈ ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంత విభాగ గౌరవ చైర్మన్‌ సౌరభ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

వివాదమిదీ.. 
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 56(2)) నిబంధన స్టార్టప్‌ సంస్థలకు సమస్యాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. స్టార్టప్‌ సంస్థ నికర మార్కెట్‌ విలువకు మించి వచ్చిన పెట్టుబడులను ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించి 30 శాతం పన్ను రేటు వర్తింపచేసేలా ఈ నిబంధన ఉంది. స్టార్టప్‌లలో పెట్టుబడుల నిబంధనలు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 2012లో ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఇది ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నందున.. దీన్ని ఏంజెల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధన కింద ఇటీవల నోటీసులు జారీ అవుతుండటంతో పలు స్టార్టప్‌లు ఆందోళన చెందుతున్నాయి. దీన్ని ఎత్తివేయాలంటూ స్టార్టప్‌ సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement