
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ (ఏపీఎల్) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఏపీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్–1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా, ఇనామ్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు 44.7 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య సేవలు, ఫార్మసీ వ్యాపారాలకు సంబంధించి దీర్ఘకాలిక విధానాన్ని సమీక్షించిన అనంతరం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. స్పష్టమైన విధానంతో పనిచేసేందుకు వీలుగా ఈ వ్యాపారాన్ని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయమని భావించినట్టు తెలిపింది.
రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యం
ఐదేళ్లలో 5,000 ఔషధ దుకాణాలు, రూ.10,000 కోట్ల ఆదాయం లక్ష్యంతో ఫార్మసీ విభాగం పనిచేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఈ నిర్ణయంతో డిజిటల్ కామర్స్‌లోకి ప్రవేశించేందుకు వీలు కలుగుతుందని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఏదన్నది నిర్ణయించుకునే సౌకర్యం వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 400 పట్టణాల్లో అపోలో ఫార్మసీకి 3,167 దుకాణాలు ఉన్నాయి. కంపెనీ వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం.. ఏపీఎల్‌కు అపోలో హాస్పిటల్స్ ఔషధ సరఫరాదారుగా ఉంటుంది. తాజా నిర్ణయం అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించదని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment